UK: చిక్కుల్లో బ్రిటన్ ఆర్థిక మంత్రి రుషీ సూనక్.. ఇన్ఫోసిస్ లో ఆయన భార్య వాటా, పన్నుల మినహాయింపుపై వివాదం

  • ఎంత మేర లాభపడ్డారంటూ ప్రతిపక్షాల నిలదీత
  • ఆమె భారత పౌరురాలేనని అధికార ప్రతినిధి వెల్లడి
  • బ్రిటన్ లో సంపాదనకు పన్నులు కడుతున్నారని వివరణ
Row Over Rishi Sunak Wife Links With Infosys and Tax

బ్రిటన్ ఆర్థిక మంత్రి రుషీ సూనక్ చిక్కుల్లో పడ్డారు. ఆయన భార్య అక్షతా మూర్తిని భారత పౌరురాలిగానే చూపిస్తూ.. భారత ఆదాయంపై పన్నుల నుంచి మినహాయింపునిస్తున్నారు. కేవలం బ్రిటన్ లోని సంపదపైనే పన్నులు వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రతిపక్ష లేబర్ పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  

అక్షతామూర్తి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అన్న సంగతి తెలిసిందే. సంస్థలో ఆమెకు 0.93 శాతం చొప్పున షేర్లు ఉన్నాయి. ఆ మేరకు వచ్చే డివిడెండ్ ఆదాయంపై బ్రిటన్ ప్రభుత్వం పన్ను మినహాయింపులను ఇస్తోంది. అయితే, ప్రభుత్వంలో ఆమె భర్త ఉన్నారు కాబట్టే ‘విదేశీయురాలు’ అన్న పేరిట పన్ను మినహాయింపులను ఇస్తున్నారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. 

ఇవాళ్టి బ్రిటన్ వార్తా పత్రికల్లో ఆ కథనాలను ప్రముఖంగానూ ప్రచురించారు. పన్ను మినహాయింపులతో సూనక్ ఎంత మేర లాభపడ్డారో చెప్పాలని లేబర్ పార్టీ ఎంపీ తులిప్ సిద్ధిఖ్ డిమాండ్ చేశారు. 

అయితే, ఆ వ్యాఖ్యలపై అక్షతామూర్తి అధికార ప్రతిని వివరణ ఇచ్చారు. అక్షతా మూర్తి ఇప్పటికీ భారత పౌరసత్వంపైనే ఉన్నారని చెప్పారు. భారత్ లో రెండు పౌరసత్వాలను అంగీకరించరని, దీంతో ఆమె భారత పౌరసత్వాన్నే ఉంచుకున్నారని పేర్కొన్నారు. కాబట్టి ఆమెను బ్రిటీష్ పౌరురాలిగా గుర్తించలేరని చెప్పారు. బ్రిటన్ లో వచ్చే సంపాదనకు ఆమె పూర్తి పన్నులను చెల్లిస్తున్నారని స్పష్టం చేశారు. 

కాగా, సూనక్ మంత్రిగా నియమితులైనప్పుడు.. తన భార్య పౌరసత్వంపై ముందుగానే చెప్పారని, ట్రెజరీ డిపార్ట్ మెంట్ కూ ఆ సమాచారం వెళ్లిందని చెబుతున్నారు. విదేశీ సంపాదనపైనా ఆమె పన్నులు చెల్లిస్తున్నారని అంటున్నారు.

More Telugu News