Ganja: హాష్ ఆయిల్ కేసు.. ప్రధాన నిందితుడు నాగేశ్వరరావు అరెస్ట్

  • అరుకులోని లోగిలికి చెందిన నాగేశ్వరరావు
  • పంట పొలాల్లో గంజాయి సాగు
  • ఎండు గంజాయి నుంచి హాష్ ఆయిల్ తయారీ
  • 8 రాష్ట్రాల్లోని స్మగ్లర్లకు సరఫరా
  • నాగేశ్వరరావు నుంచి హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న లక్ష్మీపతి, మరో ఇద్దరికి బేడీలు
Nageswara Rao who is prime suspect in Hash Oil Case arrested

హాష్ ఆయిల్ కేసులో ప్రధాన నిందితుడైన నాగేశ్వరరావు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పంటపొల్లాలో గంజాయి సాగుచేస్తూ దానిని దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లోని స్మగ్లర్లకు నాగేశ్వరరావు సరఫరా చేస్తున్నాడు. ఆయనతోపాటు హాష్ ఆయిల్‌ను తెలంగాణలోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, యువకులకు విక్రయిస్తున్న పాత నేరస్థుడు వీరపల్లి లక్ష్మీపతితో పాటు ఇద్దరు వినియోగదారులు వంశీకృష్ణ, విక్రమ్ మౌర్యలను కూడా నిన్న మాదకద్రవ్యాల నిఘా విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 5 లక్షల విలువైన మాదకద్రవ్యాలు, బైక్, నాలుగు మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

అరకులోని లోగిలి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు గత కొన్ని సంవత్సరాలుగా గంజాయి పండిస్తున్నాడు. పొడి గంజాయి నుంచి హాష్ ఆయిల్‌ను తయారుచేసి కిలో రూ. 50 వేల చొప్పున ఢిల్లీ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణతోపాటు ముంబైలోని స్మగ్లర్లకు విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే, హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటకు చెందిన వీరపల్లి లక్ష్మీపతి.. నాగేశ్వరరావు నుంచి గంజాయి, హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తూ హైదరాబాద్‌లోని వినియోగదారులకు సరఫరా చేసేవాడు. 

డిమాండ్ క్రమంగా పెరగడంతో తన వద్ద గంజాయి, హాష్ ఆయిల్ కొంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, యువకులను లక్ష్మీపతి ఏజెంట్లుగా మార్చుకున్నాడు. ప్రేమ్ ఉపాధ్యాయ, అశుతోష్, శ్రీరామ్, తరుణ్, రామకృష్ణలను ఏజెంట్లుగా నియమించుకుని వారికి హాష్ ఆయిల్ సరఫరా చేసేవాడు.

ఆ తర్వాత వీరిలో ప్రేమ్ ఉపాధ్యాయ, అశుతోష్, శ్రీరామ్ గోవా వెళ్లి సింథటిక్ డ్రగ్స్ కొనుగోలు చేసి సొంత వ్యాపారం ప్రారంభించారు. వీరిలో ప్రేమ్, శ్రీరామ్‌లను ఇప్పటికే అరెస్ట్ చేశామని, మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, లక్ష్మీపతిపై నల్గొండ, హయత్‌నగర్, నల్లకుంట, గోల్కొండ, అఫ్జల్‌గంజ్, ఎస్.కోట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్టు చెప్పారు.

More Telugu News