China: చైనా వాణిజ్య రాజధాని షాంఘైని బెంబేలెత్తిస్తున్న కరోనా.. రంగంలోకి సైన్యం

China sends military and doctors to Shanghai
  • దేశంలో నిన్న 13 వేలకు పైగా కేసులు
  • ఒక్క షాంఘైలోనే 70 శాతం కేసులు వెలుగులోకి
  • షాంఘైకి 2 వేల మంది సైన్యం, 15 వేలమంది ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు
  •  షాంఘైలో ఒక్కొక్కరికి రెండు పరీక్షలు
చైనాలో కరోనా మహమ్మారి చెలరేగిపోతోంది. వాణిజ్య రాజధాని షాంఘై కరోనా బారినపడి వణుకుతోంది. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు 70 శాతం ఇక్కడే నమోదవుతుండడం గమనార్హం. దేశవ్యాప్తంగా నిన్న 13 వేలకు పైగా కేసులు నమోదు కాగా, అందులో దాదాపు 9 వేల కేసులు ఒక్క షాంఘైలోనే వెలుగు చూశాయి. నిజానికి ఇక్కడ వారం రోజులుగా లాక్‌డౌన్ అమల్లో ఉంది. అయినప్పటికీ ఇక్కడ పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండడం అధికారులను కలవరపెడుతోంది. 

కరోనా కట్టడికి ప్రభుత్వం ఇప్పుడు సైన్యాన్ని కూడా రంగంలోకి దింపింది. ఆర్మీ, నేవీకి చెందిన దాదాపు 2 వేలమందితోపాటు 15 వేలమంది ఆరోగ్యకార్యకర్తలు, వైద్యులను షాంఘై పంపింది. ఈ నగరానికి పొరుగున ఉన్న జియాంగ్జు, జెజియాంగ్ తదితర ప్రావిన్సుల నుంచి కూడా సిబ్బందిని షాంఘై తరలిస్తున్నారు.

షాంఘైలో నిన్నటి నుంచి యాంటీజెన్, న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం షాంఘైలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయితే, అత్యవసర వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు మాత్రం అనుమతి ఇచ్చారు. ఫలితంగా ఆయా సంస్థల సిబ్బంది బయటకు రాకుండా కార్యాలయాల్లోనే ఉంటూ పనిచేస్తూ అక్కడే తిండి, నిద్ర కానిస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.
China
Shanghai
Corona Virus
Army

More Telugu News