Andhra Pradesh: అసోసియేషన్‌తో ఇదే చివరి సమావేశం కావొచ్చు.. 11 నుంచి కొత్త మంత్రులు వస్తున్నారు: పేర్ని నాని

new ministers coming from 11th April says minister Perni Nani
  • రవాణాశాఖ మంత్రిగా ఎవరు వచ్చినా ఓకే
  • ‘వన్ ఇండియా.. వన్ వెబ్‌సైట్’ను ప్రారంభించిన మంత్రి
  • అంతర్రాష్ట్ర ఒప్పందం కోసం ఎంతో కృషి చేశానన్న నాని 
ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వస్తున్న వార్తల నేపథ్యంలో మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 11 నుంచి కొత్త మంత్రులు వస్తున్నారని తెలిపారు. బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఏపీ, తెలంగాణ బస్ ఆపరేటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న విజయవాడలో ‘వన్ ఇండియా.. వన్ బస్’ వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవాణాశాఖ మంత్రిగా ఎవరు వచ్చినా తన అభిప్రాయాలను వారితో పంచుకుంటానన్నారు. మూడేళ్లపాటు మీతో కలిసి పనిచేశానని, ఇకపైనా ఏవైనా సమస్యలు ఉంటే కొత్త మంత్రి వద్దకు, అవసరమైతే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ అసోసియేషన్‌తో బహుశా ఇదే తన చివరి సమావేశం కావొచ్చని అన్నారు.

తనకు రవాణాశాఖ కేటాయించినప్పుడు దేవుణ్ని, సీఎం జగన్‌ను తిట్టుకున్నానని అన్నారు. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శిగా కృష్ణబాబు, కమిషనర్‌గా సీతారామాంజనేయులు, ఆర్టీసీ ఎండీగా సురేంద్రబాబు ఉన్నారని, వీరు ముగ్గురు ఎవరి మాటా వినరని తెలిసే అలా తిట్టుకున్నానని అన్నారు. అయితే, వీరు ఎప్పుడూ తనతో అలా వ్యవహరించలేదని, తాను ఏది చెప్పినా ఎంతో పాజిటివ్‌గా తీసుకునేవారని అన్నారు.

బస్సు, లారీ ఆపరేటర్ల కష్టాలు తనకు కూడా తెలుసని, తాను కూడా ఓ సిటీ బస్సును నిర్వహించినవాడినేనని అన్నారు. ‘వన్ ఇండియా వన్ ట్యాక్స్’ విధానం ద్వారా ముందుకు వెళ్దామని ముఖ్యమంత్రికి చెప్పానని, అయితే ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని మంత్రి పేర్కొన్నారు. అలాగే, తెలంగాణలో ఏపీ బస్సులపై కేసులు రాస్తే, తాము కూడా ఇక్కడ ఆ బస్సులకు కేసులు రాస్తామన్నారు.

అంతర్రాష్ట్ర ఒప్పందం కోసం తెలంగాణ అధికారులతో కలిసి తాను ఎన్నో ప్రయత్నాలు చేశానని, అది కనుక కార్యరూపం దాల్చి ఉంటే లారీ యజమానులు లాభపడి ఉండేవారని, ఆంధ్రాకు మాత్రం నష్టం జరిగి ఉండేదన్నారు. అయినా సరే అక్కడి లారీ యజమానుల అభ్యర్థనతో ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నామని, కానీ ఒప్పందానికి వారే సమయం ఇవ్వడం లేదని మంత్రి పేర్ని నాని విమర్శించారు.
Andhra Pradesh
Perni Nani
One India One Website

More Telugu News