ఇమ్రాన్ ఖాన్ ఎత్తుగడ మామూలుగా లేదు.. జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫారసు

03-04-2022 Sun 14:10
  • అధ్యక్షుడికి సిఫారసు లేఖ
  • రద్దు తర్వాత ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు
  • ప్రజలు ఎన్నికలకు సిద్దంగా ఉండాలి
  • అవినీతి శక్తులు దేశ భవిష్యత్తును నిర్ణయించలేవు
  • జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పాక్ ప్రధాని
Pakistan PM Imran Khan advises president to dissolve Assembly
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంచి ఎత్తుగడే వేశారు. ప్రతిపక్షాలు ఆయనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఓటింగ్ కు రాకుండా చూడగలిగారు. దీన్ని జాతీయ అసెంబ్లీ (దిగువ సభ/పార్లమెంట్) డిప్యూటీ స్పీకర్ నేడు తిరస్కరించడం తెలిసిందే. ఆ వెంటనే జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి ఇమ్రాన్ ఖాన్ సిఫారసు పంపించారు.  

తన సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని సభలో తిరస్కరించిన వెంటనే జాతినుద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. ‘‘జాతీయ అసెంబ్లీను రద్దు చేయాలని కోరుతూ అధ్యక్షుడికి లేఖ రాశాను. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ ప్రజలకు పిలుపునిస్తున్నాను’’ అని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.

తనపై అవిశ్వాసం విదేశీ కుట్ర అని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే కుట్రగా పేర్కొన్నారు. ఇదే కారణాన్ని చూపిస్తూ అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడం తెలిసిందే. కొన్ని రోజులుగా సంచలన ప్రకటనలను చేస్తూ వస్తున్న ఇమ్రాన్ ఖాన్ తెర వెనుక చక్రం తిప్పినట్టు తాజా పరిణామాలను గమనిస్తే తెలుస్తోంది. తాను అధికారం నుంచి తప్పుకునేదే లేదని ఆయన లోగడ ప్రకటించారు. 

అవిశ్వాస పరీక్షలో ఓడిపోతే ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయవచ్చంటూ హోంమంత్రి రషీద్ అహ్మాద్ సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. తన సర్కారును కూలదోసి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అదే పరిస్థితి వస్తుందని ఇమ్రాన్ కూడా భావించినట్టున్నారు. దీంతో అవిశ్వాసం ఓటింగ్ కు రాకుండా వ్యూహాత్మక ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తే తిరిగి ప్రజల ముందుకు వెళ్లి గెలవచ్చన్న అంచనాలు ఆయనలో ఉన్నట్టున్నాయి.

‘‘ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. దేశ భవిష్యత్తు ఎలా ఉండాలన్నది అవినీతి శక్తులు నిర్ణయించలేవు. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత తదుపరి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ, అపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటు మొదలవుతుంది’’ అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. 2018లో ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చారు. ఆయన్ను అసెంబ్లీలో ఓడించేందుకు సరిపడా సంఖ్యా బలం తమకు ఉన్నట్టు ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.