GS Lakshmi: రేపటి ఐసీసీ మహిళల వరల్డ్ కప్ ఫైనల్స్ కు మ్యాచ్ రిఫరీగా తెలుగుతేజం జీఎస్ లక్ష్మి

GS Lakshmi as match referee to ICC Womens World Cup Final
  • న్యూజిలాండ్ లో ఐసీసీ మహిళల వరల్డ్ కప్
  • ఆఖరి అంకానికి చేరుకున్న ఈవెంట్
  • ఫైనల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఢీ
  • మ్యాచ్ రిఫరీగా లక్ష్మిని ఎంపిక చేసిన ఐసీసీ
గత కొన్నివారాలుగా న్యూజిలాండ్ లో జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. రేపు క్రైస్ట్ చర్చ్ లో జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా ఈ టైటిల్ సమరానికి మ్యాచ్ రిఫరీగా తెలుగుతేజం జీఎస్ లక్ష్మి (53) వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఐసీసీ ప్రకటించింది. 

ఆంధ్రప్రదేశ్ కు చెందిన జీఎస్ లక్ష్మి గతంలో పురుషుల క్రికెట్లోనూ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించడం విశేషం. యూఏఈ వేదికగా రెండేళ్ల కిందట జరిగిన ఐసీసీ ఈవెంట్ లోనూ ఆమె రెండు మ్యాచ్ లకు రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించారు. తద్వారా పురుషుల క్రికెట్లో తొలి మహిళా రిఫరీగా చరిత్ర పుటల్లోకెక్కారు. 

లక్ష్మి పూర్తిపేరు గండికోట సర్వ లక్ష్మి. రాజమండ్రికి చెందిన ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి ఉద్యోగ రీత్యా ఆమె విద్యాభ్యాసం జంషెడ్ పూర్ లో సాగింది. 

కాలేజీ రోజుల్లోనే మంచి క్రికెటర్ గా గుర్తింపు పొందిన ఆమె, దేశవాళీల్లో దక్షిణ మధ్య రైల్వే, ఆంధ్రా, బీహార్, కర్ణాటక, సౌత్ జోన్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. దేశవాళీ క్రికెట్లో 18 ఏళ్ల పాటు ఆడారు. కోచ్ గానూ వ్యవహరించారు. ఆటకు వీడ్కోలు పలికాక, ఆమె 2019లో ఐసీసీ ఎలైట్ మ్యాచ్ రిఫరీల ప్యానెల్లో చోటు సంపాదించారు.
GS Lakshmi
Match Referee
World Cup Finals
ICC
New Zealand

More Telugu News