Telangana: మాస్క్ పెట్టుకోవాలా? వద్దా? అనేది మీ ఇష్టం: తెలంగాణ హెల్త్ డైరెక్టర్

Mask is not mandatory says Telangana health director
  • కోవిడ్ ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది
  • తెలంగాణలో 20 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కావడం లేదు
  • ఈ ఏడాది చివరి నాటికి కరోనా ఎండెమిక్ దశకు చేరుకుంటుంది
కోవిడ్ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. కరోనాతో రెండేళ్ల పాటు ఎంతో ఇబ్బంది పడ్డామని, మాస్క్ ధరించడాన్ని అసౌకర్యంగా భావించామని చెప్పారు. కరోనా కేసులు భారీగా తగ్గిన పరిస్థితిలో ఇష్టమైతే మాస్క్ ధరించవచ్చని, లేకపోతే లేదని అన్నారు. 

మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా కొనసాగుతుందని... అయితే ఈ విషయంలో పోలీసులు చూసీ చూడనట్టు పోవాలని చెప్పారు. రాష్ట్రం మొత్తం మీద రోజుకు 40 కేసులు నమోదవుతున్నాయని, 20 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కావడం లేదని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిథిలోనే 20 వరకు కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. 

అయితే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు మాత్రం మాస్క్ కచ్చితంగా ధరించాలని శ్రీనివాసరావు సూచించారు. ఇంకా ముప్పు పూర్తిగా తొలగిపోనందువల్ల మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. జనసమూహంలో ఉన్నప్పుడు మాస్క్ ధరించాలని చెప్పారు. చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ... ఆ వేరియంట్లు ఇప్పటికే మన దేశంలో వచ్చి పోయాయని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి కరోనా ఎండెమిక్ దశకు చేరుకుంటుందని చెప్పారు. ఎన్ని వేరియంట్లు వచ్చినా మనం తట్టుకోగలమని అన్నారు.
Telangana
Corona Virus
Mask
TS Health Dictor

More Telugu News