Naga Babu: ఏపీ ఐఏఎస్‌ల‌కు కోర్టు శిక్ష‌ల‌పై నాగ‌బాబు ఘాటు స్పంద‌న

  • 8 మంది ఏపీ ఐఏఎస్‌కు హైకోర్టులో శిక్ష‌
  • శిక్ష‌పై ఘాటుగా స్పందించిన నాగ‌బాబు
  • అధికారులు వైసీపీ కాప‌లా కుక్క‌లుగా మారార‌ని ఆరోప‌ణ
nagababu comments on ap high court verdict on ap ias officers

ఏపీలో కోర్టు ఆగ్ర‌హానికి గురైన 8 మంది సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌కు శిక్ష ప‌డిన వైనంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ సోద‌రుడు నాగ‌బాబు స్పందించారు. వైసీపీ పాల‌న‌ను టార్గెట్ చేస్తూ.. వైసీపీ పెద్ద‌లు చేసిన పాపానికి అధికారులు బ‌లి అవుతున్నార‌న్న కోణంలో నాగ‌బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.   

ఏపీలో 8 మంది ఐఏఎస్ అధికారులు కోర్టు శిక్ష‌కు గుర‌య్యార‌ని తెలిసింది అంటూ మొద‌లుపెట్టిన నాగ‌బాబు.. ఇందులో అధికారుల పాత్ర ఏమీ ఉండ‌ద‌ని తేల్చేశారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల ఆవ‌ర‌ణ‌లో గ్రామ స‌చివాల‌యాలు నిర్మించాల‌ని అధికారులు ఏమీ తీర్మానించి ఉండ‌ర‌ని చెప్పిన నాగ‌బాబు.. ఆ నిర్ణ‌యాల‌న్నీ వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల నిర్ణ‌యాలే అయి ఉంటాయ‌ని పేర్కొన్నారు. ఇక కోర్టు శిక్ష‌కు గురైన 8 మంది ఐఏఎస్‌లు కూడా మంచి స‌మ‌ర్థులైన అధికారులేన‌ని కూడా ఆయ‌న ఓ కామెంట్ చేశారు.

ఈ ట్వీట్ పోస్ట్‌కు ఆయ‌న సుదీర్ఘ కామెంట్రీ కూడా జ‌త చేశారు. ప‌రిపాలన ఎలా ఉండ‌కూడ‌ద‌న్న దానికి ప్ర‌స్తుత ఏపీ ప్ర‌భుత్వ‌మే ఉదాహ‌ర‌ణ అని నాగ‌బాబు పేర్కొన్నారు. స‌మాజానికి, రాజ్యాంగానికి సంర‌క్షకులుగా ఉండాల్సిన అధికారులు వైసీపీ మాయ‌లో ప‌డిపోయార‌ని, వారంతా ఇప్పుడు వైసీపీ కాపలా కుక్కలుగా మారిపోయార‌ని కూడా నాగ‌బాబు ఆరోపించారు. ఇత‌ర అధికారుల‌కు త‌మ విధి నిర్వ‌హ‌ణ గుర్తుకు వ‌చ్చేలా వీరిని శిక్షించాల‌ని కూడా నాగ‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు.

More Telugu News