Vasireddy Padma: గుంటూరు జిల్లా మైనర్ బాలిక అత్యాచారం ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న మహిళా కమిషన్

  • పేరేచర్లకు చెందిన మైనర్ బాలిక దారుణం
  • ఇప్పటిదాకా 64 మంది అరెస్ట్
  • నేడు బాధితురాలితో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ
Women Commission Chair Person Vasireddy Padma talks about minor girl incident

కొన్ని నెలల కిందట వెలుగుచూసిన గుంటూరు జిల్లా పేరేచర్లకు చెందిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఇప్పటివరకు పోలీసులు 64 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి సరిగా దర్యాప్తు చేయడం లేదంటూ వచ్చిన తాజా ఆరోపణలపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా దృష్టి సారించింది. ఓ సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న బాధితురాలిని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నేడు కలిశారు. 

దర్యాప్తులో ఏమైనా లోపాలు ఉన్నాయా? అని ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు అర్బన్ ఎస్పీతోనూ ఆమె మాట్లాడారు. అంతేకాదు, మహిళా కమిషన్ కార్యాలయానికి బాధితురాలి తండ్రిని కూడా పిలిపించి మాట్లాడారు. బాధితురాలిని ఎప్పుడు దత్తత తీసుకున్నారన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసును విభిన్న కోణాల్లో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. బాధితురాలికి జరిగిన అన్యాయం పరమ దుర్మార్గం అని పేర్కొన్నారు. 

పుండుమీద కారంలా ఈ ఘటనను కొందరు స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నా వదిలే ప్రసక్తే లేదని అన్నారు.

More Telugu News