Team India: మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా కల చెదిరింది... కీలక మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి

Team India campaign comes to an end in womens world cup
  • చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా మ్యాచ్
  • ఆఖరిబంతికి గెలిచిన దక్షిణాఫ్రికా
  • ఓ నోబాల్ వేసిన దీప్తి శర్మ
  • సెమీస్ చేరిన దక్షిణాఫ్రికా
  • ఇంటిముఖం పట్టిన భారత్
న్యూజిలాండ్ లో జరుగుతున్న మహిళల వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్రమించింది. సెమీస్ బెర్తు కోసం చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో చివరి బంతి వరకు పోరాడిన భారత్ కు నిరాశే మిగిలింది. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు కావాల్సి ఉండగా.... టీమిండియా బౌలర్ దీప్తి శర్మ చేసిన చిన్న పొరబాటు మ్యాచ్ ను కోల్పోయేలా చేసింది. తద్వారా టీమిండియా వరల్డ్ కప్ ఆశలు ముగిశాయి. 

దీప్తి శర్మ వేసిన బంతిని దక్షిణాఫ్రికా బ్యాటర్ డుప్రీజ్ లాంగాన్ దిశగా కొట్టగా, అక్కడ హర్మన్ ప్రీత్ కౌర్ క్యాచ్ పట్టింది. దాంతో భారత శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. కానీ అది నోబాల్ అని అంపైర్ ప్రకటించడంతో, దక్షిణాఫ్రికా జట్టుకు పరుగు రావడంతో పాటు ఫ్రీహిట్ కూడా లభించింది. ఇక చివరి బంతికి 1 పరుగు అవసరం కాగా, దక్షిణాఫ్రికా ఈజీగా సాధించింది. దాంతో భారత్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 

ఈ మ్యాచ్ లో తొలుత టీమిండియా మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 274 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా కూడా సరిగ్గా అన్నే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో ఓపెనర్ లారా వోల్వార్ట్ 80, లారా గూడాల్ 49, మిగ్నాన్ డుప్రీజ్ 52 నాటౌట్, మరియానే కాప్ 32 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 2, హర్మన్ ప్రీత్ కౌర్ 2 వికెట్లు తీశారు. 

కాగా, ఈ విజయంతో దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ ఫలితం అటు వెస్టిండీస్ అమ్మాయిలకు కూడా కలిసొచ్చింది. వారు కూడా సెమీఫైనల్లో అడుగుపెట్టారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇప్పటికే సెమీస్ చేరాయి. సెమీస్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో వెస్టిండీస్, ఇంగ్లండ్ తో దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. మార్చి 30, 31 తేదీల్లో సెమీస్ మ్యాచ్ లు జరగనుండగా, ఏప్రిల్ 3న ఫైనల్ జరగనుంది.
Team India
Women
World Cup
South Africa

More Telugu News