Telugudesam: దీని ప్రకారమే ఏపీ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేశారు: టీడీపీ ఎంపీలు

  • చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉంది
  • చట్టాల ప్రకారమే పునర్విభజన చట్టం ఇప్పటికే అమలు
  • కేంద్ర ప్రభుత్వమే చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదించింది
  • వైసీపీ స‌ర్కారుపై కనకమేడల, రామ్మోహ‌న్ నాయుడు ఫైర్
telugudesam mps slam ycp govt

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ ఎంపీలు మండిప‌డ్డారు. ఈ రోజు ఢిల్లీలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని, చట్టాల ప్రకారమే పునర్విభజన చట్టం ఇప్పటికే అమలు చేశారని కనకమేడల రవీంద్ర కుమార్‌ అన్నారు. దీని ప్రకారమే ఏపీ రాజధానిగా అమరావతి ఏర్పాటు చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదించిందని ఆయ‌న చెప్పారు. 

రాజ్యాంగాన్ని మారుస్తామంటే కుదరదని, న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఆయ‌న అన్నారు. కొంద‌రు జడ్జిలను కూడా బెదిరించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. న్యాయ‌స్థానం ఇచ్చిన‌ తీర్పులపై సభలో వక్రభాష్యాలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించకూడ‌ద‌ని ఆయ‌న అన్నారు.  

ఏపీ సీఎం జ‌గ‌న్ రాష్ట్రంలో అప్పులు తెచ్చి ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నార‌ని ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు అన్నారు. క‌నీసం ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వేత‌నాలు, పెన్ష‌నర్ల‌కు పింఛ‌న్లు ఇచ్చేందుకు కూడా ప్ర‌భుత్వ ఆదాయం లేద‌ని ఆయ‌న చెప్పారు. సంప‌ద‌ను సృష్టించే ఆలోచ‌న కూడా జ‌గ‌న్‌కు లేద‌ని అన్నారు. పన్నుల‌ను విప‌రీతంగా పెంచేశార‌ని ఆయ‌న చెప్పారు. డ్రైనేజీ, చెత్త మీద కూడా ప‌న్నులు వేస్తున్నార‌ని, ఇష్టానుసారం ప‌న్నులు వేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News