Junior NTR: సినిమా రివ్యూ: మట్టి కోసం .. మల్లి కోసం జరిగే పోరాటమే.. 'ఆర్ ఆర్ ఆర్'!

RRR Movie Review
  • ఈ రోజే విడుదలైన 'ఆర్ ఆర్ ఆర్'
  • యాక్షన్ .. ఎమోషన్  ప్రధానంగా సాగే కథ
  • పోటీపడి మెప్పించిన  ఎన్టీఆర్ - చరణ్  
  • కీలకమైన పాత్రను పోషించిన సంగీతం - ఫొటోగ్రఫీ
  • అభిమానులను రంజింపజేసిన రాజమౌళి    

'ఆర్ .. ఆర్ .. ఆర్' రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మరో భారీ చిత్రం. ఎన్టీఆర్ .. చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. అలియా భట్ .. ఒలీవియా  కథానాయికలుగా నటించిన ఈ  సినిమాలో, అజయ్ దేవగణ్ .. శ్రియ .. సముద్రఖని ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ రోజునే ఈ సినిమా  ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అల్లూరి సీతారామరాజు .. కొమరం భీమ్ పాత్రలతో  చరిత్రను టచ్ చేస్తూ .. ఆ చరిత్రకు కాల్పానికతను జోడిస్తూ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందనేది ఇప్పుడు చూద్దాం.


ఈ కథ ఆదిలాబాద్ అడవిలో మొదలవుతుంది. గోండు జాతికి చెందిన 'మల్లి' అనే ఒక అమ్మాయిని బ్రిటిష్ దొరలు బలవంతంగా తీసుకుని పోతారు. ఆ పిల్ల కోసం గూడెం .. గూడెం తల్లడిల్లిపోతుంటుంది. 'మల్లి'ని తీసుకుని రావడానికి కొమరం భీమ్ తనవాళ్లతో కలిసి ఢిల్లీ వెళతాడు. అక్కడి తెల్లవాళ్ల కోటలోకి ఎలా వెళ్లాలో తెలియక అందుకు తగిన మార్గాల కోసం అన్వేషిస్తూ  ఉంటాడు. బ్రిటిష్ వారి దగ్గర సీతారామరాజు పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు.

గోదావరి తీరంలోని మన్యం ప్రాంతంలో తన వాళ్లను ఆంగ్లేయుల వలన పోగొట్టుకున్న సీతారామరాజు, బ్రిటీష్ వాళ్లను ఎదిరించడానికి తగిన ఆయుధాలను తన గ్రామస్థులకు అందించాలనే ఉద్దేశంతో ఆయన అక్కడ చేరతాడు. తగిన ఆయుధాలను తన ఊరికి తరలించే సమయం కోసం ఆయన ఎదురుచూస్తుంటాడు. 

ఈ క్రమంలోనే సీతారామరాజు ..  కొమరం భీమ్ కలుసుకుంటారు. కొమరం భీమ్ తాను మల్లి కోసం వచ్చినట్టుగా సీతారామరాజుకి చెప్పడు. అలాగే తాను పోలీస్ ఆఫీసర్ ను అనే సంగతిని కొమరం భీమ్ కి సీతారామరాజు చెప్పడు. మల్లి కోసం ఒకరు .. మట్టి కోసం ఒకరు బ్రిటిష్ వారిని ఎలా ఎదిరించారు? ఈ పోరాటంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? చివరికి ఎలా విజయాన్ని సాధించారనేదే కథ. 

రాజమౌళి తన సినిమాల్లో పాత్రలను తీర్చిదిద్దే విషయంలో మాస్టర్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తనదైన ప్రత్యేకతను ఆయన ఈ సినిమాలోను చూపించారు. రెండు బలమైన పాత్రలను కథ మొదలైన కాసేపటికే తెరపైకి తీసుకుని వచ్చారు. రెండు పవర్ఫుల్ పాత్రల ఇంట్రడక్షన్ కూడా అంచనాలకు మించి ఉండేలా చూసుకున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరు బలమైన స్టార్ హీరోలు ఉండటంతో ఎవరి ఎంట్రీ ఎలా ఉంటుందో అనే ఒక ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇద్దరి హీరోల్లో పోలీస్ ఆఫీసర్ గా చరణ్ ఇంట్రడక్షన్ ముందుగా జరుగుతుంది. 

చరణ్ ఎంట్రీ భారీ జన సమూహం మధ్య కాస్త గందరగోళంగానే జరుగుతుంది. వందలాది మందిపై లాఠీతో ఛార్జ్ చేస్తూ ఒక్కడే వాళ్ల మధ్యకి వెళ్లడం కాస్త అతిశయంగా అనిపిస్తుంది. తెరపై ఆ సీన్ ను చూస్తుంటే, 'మనం చూసేది క్లైమాక్స్ కాదు గదా?' అనే అనుమానం వస్తుంది. ఆ రేంజ్ లో తీశారు. ఇక అడవి బిడ్డగా కొమరం భీమ్ ఎంట్రీ .. ఆ పాత్ర దమ్ము చూపించే స్థాయిలోనే ఉంటుంది. కొమరం భీమ్ పాత్ర తెరపైకి రావడానికి ముందే, ఆ పాత్రను గురించి రాజీవ్  కనకాల పాత్రతో చెప్పించిన తీరు బాగుంది. 

ఎన్టీఆర్ .. చరణ్  పాత్రలను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎక్కడ ఏ పాత్ర ఎక్కువ .. ఏ పాత్ర తక్కువ అనే ఆలోచన రానీయకుండా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఎక్కడైతే ఒక విషయాన్ని రివీల్ చేయవలసి వస్తుందో, అక్కడే మరో విషయాన్ని లాక్ చేస్తూ ఆయన ఈ కథనాన్ని గొప్పగా నడిపించారు. రెండు ప్రధానమైన పాత్రలతోను యాక్షన్ ను .. ఎమోషన్ ను ఆయన అవిష్కరించిన తీరు కట్టిపడేస్తుంది. కొమరం భీమ్ ను తానే శిక్షించవలసి వచ్చినప్పుడు, అతని శరీరం నుంచి చిందిన రక్తాన్ని సీతారామరాజు కన్నీటితో కలిపి తుడుచుకోవడం ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేస్తుంది. 

సీతారామరాజు పాత్ర ఆంగ్లేయులపై పోరాడడానికి బలమైన కారణం కనిపిస్తుంది. అలాగే మల్లి కోసం కొమరం భీమ్ రావడం కూడా బలమైన కారణమే. అయితే మల్లిని తెల్లదొరలు తీసుకుని వెళ్లడానికి బలమైన కారణం కనిపించదు. మానవ మాత్రుడు ప్రవేశించలేని కోటలో మల్లి అనే ఒక చిన్న పిల్లను అంత కోటలోను ప్రత్యేకమైన 'చెర'లో ఉంచటం కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ ఒక్క కారణం తప్ప మిగతావన్నీ కథలో ఎక్కడికక్కడ బాగానే సర్దడం జరిగింది. 

 మంటల మధ్యలో చిక్కుకున్న ఓ కుర్రాడిని సీతారామరాజు .. కొమరం భీమ్ కలిసి రక్షించే సీన్ .. ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ .. కొమరం భీమ్ ను సీతారామరాజు తప్పించే సీన్ .. సీతకి కొమరం భీమ్ మాట ఇచ్చే సీన్ .. సీతారామరాజును కొమరం భీమ్ తప్పించే సీన్ .. సీతారామరాజు .. అల్లూరి సీతారామరాజుగా మారిపోయే సీన్ .. ఇద్దరూ కలిసి బ్రిటీష్ సైన్యాన్ని ఎదుర్కునే సీన్ ఈ సినిమాలో హైలైట్స్ గా కనిపిస్తాయి .. వన్స్ మోర్ అనిపిస్తాయి.   

ప్రతి సన్నివేశంలోను .. ప్రతి పాటలోను .. ప్రతి ఫైట్ లోను రాజమౌళి పెర్ఫెక్ట్  ప్లానింగ్ కనిపిస్తుంది. స్కాట్ దొర (రే స్టీవెన్ సన్)  జెన్నీఫర్ (ఒలీవియా) సీత (అలియా భట్) బాబా (అజయ్ దేవగణ్) సరోజని( శ్రియ) వెంకటేశ్వర్లు (సముద్రఖని) పాత్రలను రాజమౌళి కథలో అవసరం మేరకు నడిపించారు. ఒక వైపున స్కాట్ దొర .. అతనిని రెండు మార్గాలలో ఎదుర్కునే ఎన్టీఆర్  - చరణ్ వీళ్ల మధ్యనే కథ నడుస్తుంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గా వచ్చే అజయ్ దేవగణ్ ఎపిసోడ్ కూడా కథకు మరింత బలాన్నిచ్చేదే. 

ఇక సీత పాత్రలో అలియా సెట్ కాలేదేమో .. ఆ లుక్ ఆమెకి అతికినట్టుగా అనిపిస్తుంది. ఒలీవియా మాత్రం తన పాత్రలో ఒదిగిపోయింది. ఒలీవియా - ఎన్టీఆర్, అలియా - చరణ్ జంటల మధ్య పాటలను ఆశించినవారికి ఒకింత నిరాశ కలుగుతుంది. అందుకేనేమో రోలింగ్ టైటిల్స్ సమయంలో అందరితో కలిసి ఒక పాట పాడించేశారు .. ఆడించేశారు. ఈ పాటలో రాజమౌళి కనిపించడం కొసమెరుపు. 

 కథాకథనాల తరువాత చెప్పుకోవలసింది కీరవాణి సంగీతం .. బ్యాక్  గ్రౌండ్ స్కోర్ గురించే. ఏ పాటకు ఆ పాట గొప్పగా ఉందనిపిస్తుంది. 'దోస్తీ ..' .. 'నాటు  నాటు' .. పాటలు  ఉత్సాహాన్నీ .. ఉత్తేజాన్ని పెంచితే, 'కొమరం భీముడో ..' పాట అది వచ్చే సందర్భాన్ని బట్టి మనసును భారం చేస్తుంది. ఇక ప్రతి సన్నివేశాన్ని .. పాటను అద్భుతంగా చిత్రీకరించిన సెంథిల్ కుమార్ కి  నూటికి నూరు మార్కులు ఇచ్చేయవచ్చు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. 

బుర్ర సాయిమాధవ్ మాటలు మనసును తాకుతాయి. 'నా ధైర్యం నిన్ను నడిపిస్తుంది .. నువ్విచ్చే ధైర్యం నన్ను  గెలిపిస్తుంది. .. 'కొమరం భీమ్ ఆవేశం అందరినీ ఆయుధాలుగా మార్చింది' ..  'నేను మల్లి కోసం వచ్చాను .. నువ్వు మట్టి కోసం వచ్చావని అర్థమైంది'.. 'సీత  కనిపించింది .. కళ్లు తెరిపించింది' .. 'ఆయన చేసేది ఉద్యోగం కాదు .. ఉద్యమం' వంటి మాటలు మనసును పట్టుకుంటాయి. కింగ్ సోలొమన్ యాక్షన్ కొరియోగ్రఫీ కట్టిపడేస్తుంది. ఇక ఆర్ట్ డైరెక్టర్ పని తీరును కూడా మెచ్చుకోకుండా ఉండలేం. ఆంగ్లేయుల కాలం నాటి సెటప్ ను గొప్పగా ఆవిష్కరించారు. అలాగే కాస్ట్యూమ్స్ డిజైనింగ్ కూడా మంచి మార్కులు సంపాదించుకుంటుంది. 

ఎన్టీఆర్ .. చరణ్  ఇద్దరూ కూడా యాక్షన్ .. ఎమోషన్  .. డాన్సులు .. ఫైట్ల విషయంలో  పోటీపడి చేశారు. ఎవరూ కూడా ఎక్కడా కూడా పాత్రలో నుంచి బయటికి రాలేదు. వాళ్లలో ఎనర్జీ లెవెల్స్ ఎంతమాత్రం తగ్గలేదు. ఇక స్కాట్ దొరగా వేసిన రే స్టీవెన్సన్ .. పోరాట వీరుడైన బాబా పాత్రను పోషించిన అజయ్ దేవగణ్ కూడా గొప్పగా చేశారు. ఈ సినిమాకి ఈ నాలుగు పాత్రలే మెయిన్ పిల్లర్స్. మిగతా పాత్రలన్నీ వీటిని ఆధారంగా చేసుకుని నడుస్తుంటాయి.  ఇటు మెగా ఫాన్స్ ను కానీ .. అటు  నందమూరి అభిమానులను కానీ ఈ సినిమా ఎంతమాత్రం అసంతృప్తికి గురిచేయదు. సినిమా మొత్తం చూశాక, ఈ సినిమాలో రాజమౌళితో కలుపుకుని ముగ్గురు హీరోలు అనిపిస్తుంది. ఎన్టీఆర్ - చరణ్ కెరియర్లో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

---  పెద్దింటి గోపీకృష్ణ

  • Loading...

More Telugu News