Arvind Kejriwal: కొందరు వ్యక్తులు కశ్మీరీ పండిట్ల పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారు: కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు

  • ఇటీవల విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం
  • 13 రోజుల్లో రూ.200 కోట్ల కలెక్షన్లు
  • స్పందించిన అరవింద్ కేజ్రీవాల్
  • ఈ సినిమా బీజేపీ నేతలకు ఉపయోగపడుతోందని వ్యాఖ్యలు
Kejriwal comments on The Kashmir Files

ఈ నెల 11న రిలీజైన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం భారత్ లో రాజకీయ దుమారం రేపుతోంది. 1990లో జమ్మూ కశ్మీర్ లో పండిట్లపై జరిగిన ఘాతుకాలను ఈ చిత్రంలో చూపించారు. వాస్తవ సంఘటల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 13 రోజుల్లోనే రూ.200 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ చిత్రంపై ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.  

ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, కశ్మీరీ పండిట్ల పేరుతో కొందరు వ్యక్తులు కోట్లు కొల్లగొడుతున్నారని ఘాటుగా విమర్శించారు. బీజేపీ నేతలేమో పోస్టర్లు అంటించే పనిలో పడ్డారని వ్యాఖ్యానించారు. 

"అగ్నిహోత్రి (ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు) కశ్మీరీ పండిట్ల పేరు చెప్పుకుని కోట్లు సంపాదించాడు. బీజేపీ నేతలు ఈ సినిమా ద్వారా చక్కగా ప్రచారం చేసుకుంటున్నారు. ఏంచేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి. ఇకనైనా కళ్లు తెరవండి" అంటూ కేజ్రీవాల్ హితవు పలికారు. 

ఇటీవల హర్యానాలో 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడం నిలిపివేయాలని ఓ బీజేపీ నేతను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కోరుతూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పైనే కేజ్రీవాల్ స్పందించారు. కాగా, ఈ చిత్రానికి బీహార్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, హర్యానా, త్రిపుర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వినోద పన్ను మినహాయించారు.

More Telugu News