Dharmana Prasad: చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న శాస‌న వ్య‌వ‌స్థ‌దే.. ఏపీ అసెంబ్లీలో ధ‌ర్మాన వ్యాఖ్య‌

  • మూడు రాజ‌ధానుల‌పై అసెంబ్లీలో చ‌ర్చ‌
  • చ‌ర్చ‌ను ప్రారంభించిన మాజీ మంత్రి ధ‌ర్మాన‌
  • వ్య‌వ‌స్థ‌ల ప‌రిధులు ప్రస్తావిస్తూ కీల‌క ప్ర‌సంగం
ysrcp mla dharmana prasadarao comments on three capitals

చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న జాతీయ స్థాయిలో పార్ల‌మెంటుకు, రాష్ట్ర స్థాయిలో శాస‌న‌స‌భ‌కు మాత్ర‌మే ఉన్నాయ‌ని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. ఈ అధికారం మ‌రే ఇత‌ర వ్య‌వ‌స్థ‌కు లేద‌ని కూడా ఆయ‌న తేల్చి చెప్పారు. ఈ మేరకు మూడు రాజ‌ధానుల అంశంపై అసెంబ్లీలో చ‌ర్చ‌ను మొద‌లుపెట్టిన సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు.

 ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాలంటూ రాజ‌ధాని రైతులు వేసిన పిటిష‌న్ల‌ను విచారించిన సంద‌ర్భంగా వైసీపీ సర్కారుకు హైకోర్టు వ్య‌తిరేకంగా తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం అసెంబ్లీలో మూడు రాజ‌ధానుల‌పై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ ప్రారంభ‌మైంది. 

ఈ చ‌ర్చ‌ను ప్రారంభించిన ధ‌ర్మాన మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాను సీఎం జగన్‌కు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. హైకోర్టు తీర్పు తర్వాత న్యాయ నిపుణులతో చర్చించానని చెప్పారు. దీనిపై సభలో చర్చించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. 

ఒక వ్యవస్థను ఇంకో వ్యవస్థ పలచన చేస్తుంటే ఇది పరువు తీసుకోవడమే కాకుండా తగని పని అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. శాసనాలు చేసే అధికారం అసెంబ్లీ, పార్లమెంట్‌కు తప్ప వేరే వాళ్లకు లేదన్నారు. రాజ్యాంగ వ్యతిరేకమైన సందర్భంలో మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చన్నారు. 

ప్రభుత్వం మారితే విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని న్యాయవ్యవస్థ ఎలా చెబుతుందని ధ‌ర్మాన‌ ప్రశ్నించారు. ప్రజలు తీర్పు ఇచ్చారంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నచ్చలేదనే అర్థం కదా? అని అభిప్రాయపడ్డారు. కొత్త విధానాలు చేయాలన్నదే ప్రజల ఉద్దేశం కదా? అన్నారు. ఆ అధికారం లేదని కోర్టులు చెప్తే ఏం చేయాలని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు వేటికవే వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. ఈ మూడు వ్యవస్థల్లో ప్రజాభిప్రాయాన్ని తెలిపేది కేవలం శాసన వ్యవస్థ మాత్రమే అని ధర్మాన స్పష్టం చేశారు.

More Telugu News