Kerala: మలయాళ స్టార్ హీరో సురేశ్ గోపి సోదరుడి అరెస్ట్

Police Arrests Malayala Hero Suresh Gopi Brother For Land Scam
  • భూ వివాదంలో అదుపులోకి తీసుకున్న కేరళ పోలీసులు
  • వివాదంలో ఉన్న భూమిని అమ్మిన సునీల్ గోపి
  • రిజిస్ట్రేషన్ తర్వాత బయటపడిన వైనం
  • నిలదీస్తే బెదిరింపులకు దిగాడని బాధితుడి ఫిర్యాదు
మలయాళ స్టార్ హీరో, ఎంపీ సురేశ్ గోపీ సోదరుడు సునీల్ గోపిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భూ వివాదం కేసుకు సంబంధించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యాపారిని రూ.97 లక్షలకు మోసం చేశాడన్న ఆరోపణలపై కోజికోడ్ లో గత శనివారం సునీల్ ను అరెస్ట్ చేశారు. 

గౌండర్ మిల్స్ సమీపంలోని తిరువల్లూర్ వీధికి చెందిన గిరిధరన్ (36) అనే వ్యాపారి.. సునీల్ పై కేసు పెట్టారని పోలీసులు తెలిపారు. తమిళనాడు కోయంబత్తూర్ లోని మావుథంపాటిలో తనకున్న 4.52 ఎకరాల భూమిని అమ్మేందుకు ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా గత ఏడాది నవంబర్ 19న గిరిధరన్ ను సునీల్ కలిశాడని చెప్పారు. భూమిని కొనేందుకు గిరిధరన్ ఒప్పుకొని రూ.97 లక్షలు సునీల్ కు పంపాడని తెలిపారు. 

అదే ఏడాది నవంబర్ 24న భూమి రిజిస్ట్రేషన్ కూడా అయిందని చెప్పారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్ తీయగా.. ఆ భూమిపై సివిల్ కేసున్నట్టు తెలుసుకున్నాడని, డిసెంబర్ 25న ఈ విషయంపై సునీల్ నిలదీస్తే నెలలో డబ్బులు తిరిగిచ్చేస్తానని చెప్పాడని పేర్కొన్నారు. 

డబ్బు విషయమై మరోసారి ఈ ఏడాది ఫిబ్రవరి 20న సునీల్ గోపిని నిలదీస్తే బెదిరింపులకు దిగాడని బాధితుడు ఫిర్యాదు చేశాడని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. సునీల్ తో పాటు రీనా, ఆమె భర్త శివదాస్ లపైనా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సునీల్ ను కోర్టులో హాజరుపరిచారు. మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు.
Kerala
Suresh Gopi
Crime News

More Telugu News