Navjot Singh Sidhu: 34 ఏళ్లు గడిచిపోయినా సిద్ధూని వెంటాడుతున్న పాత కేసు

Supreme Court to here Navjot Singh Sidhu case on March 25
  • 1988లో గుర్నామ్ సింగ్ పై సిద్ధూ, ఆయన స్నేహితుడి దాడి
  • దాడిలో గుర్నామ్ సింగ్ మృతి
  • రోడ్డు పక్కన గొడవ అని సిద్ధూని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన గుర్నామ్ సింగ్ కుటుంబం


పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీసీసీ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. మరోవైపు, సిద్ధూను ఒక కేసు 34 ఏళ్లుగా వెంటాడుతోంది. 

వివరాల్లోకి వెళ్తే 1988 డిసెంబర్ లో పాటియాలాలో పార్కింగ్ విషయమై గుర్నామ్ సింగ్ అనే వ్యక్తితో సిద్ధూ, ఆయన స్నేహితుడు రూపీందర్ సింగ్ సాధుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గుర్నామ్ సింగ్ ను కారు నుంచి బయటకు లాగిన సిద్ధూ, రూపీందర్ సింగ్ లు దాడి చేశారు. ఈ దాడిలో గుర్నామ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. దాడి తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. 

అయితే ఈ కేసులో సిద్ధూని నిర్దోషిగా తేల్చిన పంజాబ్-హర్యానా హైకోర్టు... ఆయనకు రూ. 1000 జరిమానా విధిస్తూ 2018లో తీర్పును వెలువరించింది. తీర్పు సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రోడ్డు పక్కన ఘర్షణలు సాధారణ అంశమని... దీన్ని హత్య కేసుగా చూడలేమని తెలిపింది. 

అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గుర్నామ్ సింగ్ కుటుంబసభ్యులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 25న పిటిషన్ ను విచారించనుంది. దీంతో, సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతోందనే ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News