central universities: సెంట్రల్ యూనివర్సిటీల్లో సీటు కావాలంటే ఎంట్రన్స్ పాస్ కావాల్సిందే

  • కొత్తగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్ టెస్ట్
  • ఇందులో మార్కులే ప్రవేశాలకు ఆధారం
  • ప్రకటించిన యూజీసీ చైర్మన్ కుమార్
  • జూలైలో ప్రవేశ పరీక్ష
  • ఏప్రిల్ నుంచి దరఖాస్తులకు అవకాశం
Entrance test for admissions into central universities

ఇంటర్ మెమో చేతికి అందితే సెంట్రల్ యూనివర్సిటీల్లో సీటు సంపాదించొచ్చులే! అనుకుంటే.. ఇకపై అలా కుదరదు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాల్సిందే. అన్ని సెంట్రల్ యూనివర్సిటీలు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) స్కోర్ ఆధారంగా విద్యార్థులకు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయని యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ తెలిపారు. అంతేకానీ, ప్రవేశాలకు ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకోబోవన్నారు. 


 జులై మొదటి వారంలో సీయూఈటీ నిర్వహించే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎంట్రన్స్ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి యూజీసీ అనుమతించనుంది. ‘‘2022-23 విద్యా సంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీయూఈటీని నిర్వహిస్తుంది. అన్ని సెంట్రల్ యూనివర్సిటీలు తాము అందించే ప్రోగ్రామ్ లలో ప్రవేశాలకు సీయూఈటీ స్కోరును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’’ అని కుమార్ తెలిపారు. 

దేశవ్యాప్తంగా 45 సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇవి నాణ్యమైన విద్యకు నిలయాలుగా గుర్తింపు సాధిస్తున్నాయి. 12వ తరగతి ఎన్సీఆర్టీ మోడల్ సిలబస్ ఆధారంగానే సీయూఈటీ పరీక్ష ఉంటుందని కుమార్ తెలిపారు. ఎంట్రన్ టెస్ట్ లో సెక్షన్ 1ఏ, సెక్షన్ 1బీ, జనరల్ టెస్ట్, డొమైన్ ప్రత్యేక సబ్జెక్ట్ లపై అంశాలు ఉంటాయని చెప్పారు. సెక్షన్ 1ఏ ను 13 భాషల్లో ఎంచుకోవచ్చని చెప్పారు. డొమైన్ లకు సంబంధించి గరిష్ఠంగా ఆరింటిని ఎంపిక చేసుకోవచ్చన్నారు.
 
రిజర్వేషన్లపై సీయూఈటీ ప్రభావం ఉండదని కుమార్ స్పష్టం చేశారు. సీయూఈటీ స్కోరు ఆధారంగా జనరల్ సీట్లు, రిజర్వ్ డ్ సీట్లను యూనివర్సిటీలు భర్తీ చేసుకోవచ్చన్నారు. రిజర్వేషన్ పాలసీ ఇక ముందూ కొనసాగుతుందని, కాకపోతే రిజర్వేషన్ కు అర్హులైన వర్గాలు కూడా సీయూఈటీ ద్వారానే ప్రవేశాలు పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

More Telugu News