Farners: సాగు చ‌ట్టాల ర‌ద్దుతో రైతుల‌కు ఆదాయం పెరిగే అవ‌కాశాలు పోయాయి: నిపుణుల క‌మిటీ స‌భ్యుడు అనిల్ ఘ‌న్వ‌త్

  • అన్న‌దాత‌ల ఉద్య‌మంతో నూత‌న సాగు చ‌ట్టాల ర‌ద్దు
  • సాగు చ‌ట్టాల‌పై అధ్య‌య‌నానికి నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు
  • సాగు చ‌ట్టాల ర‌ద్దు బీజేపీ చేసిన అతి పెద్ద త‌ప్పన్న క‌మిటీ స‌భ్యుడు
expert committee memmber comments on farm laws

దేశానికి వెన్నెముక అయిన వ్య‌వ‌సాయ రంగంలో స‌మూల మార్పుల కోస‌మంటూ న‌రేంద్ర మోదీ స‌ర్కారు ప్ర‌తిపాదించిన నూత‌న సాగు చ‌ట్టాల ర‌ద్దు వ‌ల్ల దేశ రైతాంగం ఆదాయం కోల్పోయింద‌ని ఈ చ‌ట్టాలపై ఏర్పాటైన నిపుణుల క‌మిటీ స‌భ్యుడు అనిల్ ఘ‌న్వ‌త్ వ్యాఖ్యానించారు. 

నూత‌న సాగు చ‌ట్టాలు రైతుల ఆదాయానికి గండి కొట్ట‌డ‌మే కాకుండా.. మొత్తం వ్య‌వ‌సాయ రంగం కార్పొరేట్ల గుత్తాధిప‌త్యంలోకి పోతుంద‌న్న ఆందోళ‌న‌తో రైతాంగం పెద్ద ఎత్తున ఉద్య‌మాలు సాగించిన సంగ‌తి తెలిసిందే. రైతుల ఉద్య‌మం ఫ‌లితంగా మోదీ స‌ర్కారు ఈ చ‌ట్టాల‌ను వెన‌క్కు తీసుకుంటున్న‌ట్లు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

రైతుల ఉద్య‌మం నేప‌థ్యంలో అస‌లు నూత‌న సాగు చ‌ట్టాల వ‌ల్ల ఎలాంటి ఫ‌లితాలు రానున్నాయ‌న్న విష‌యంపై అధ్య‌య‌నం చేసి ఓ నివేదిక ఇవ్వాలంటూ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు నిపుణుల క‌మిటీని రంగంలోకి దించిన సంగ‌తి తెలిసిందే. ఈ క‌మిటి సుదీర్ఘ ఆధ్య‌య‌నం త‌ర్వాత త‌న నివేదిక‌ను కోర్టుకు అంద‌జేసింది. ఆ నివేది‌క‌లోని అంశాలేమిటో ఇప్ప‌టిదాకా తెలియ‌కున్నా..  తాజాగా నిపుణుల కమిటీలో సభ్యుడిగా ప‌నిచేసిన అనిల్ ఘ‌న్వ‌త్ కొన్ని వివ‌రాల‌ను సోమ‌వారం వెల్ల‌డించారు.

నూత‌న సాగు చ‌ట్టాల వ‌ల్ల రైతుల‌కు న‌ష్ట‌మేమీ లేదంటూ అనిల్‌ ఘ‌న్వ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ చ‌ట్టాల ర‌ద్దు కోసం పంజాబ్‌తో పాటు ఉత్త‌ర భార‌తానికి చెందిన రైతులే ఉద్య‌మం సాగించార‌ని ఆయ‌న చెప్పారు. నూత‌న సాగు చ‌ట్టాల‌కు ఏకంగా 65 రైతు సంఘాలు మ‌ద్ద‌తు తెలిపాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. చ‌ట్టాల‌పై 73 వ్య‌వ‌సాయ సంస్థ‌ల‌తో తాము చ‌ర్చ‌లు సాగించామ‌ని తెలిపారు. సాగు చ‌ట్టాల ర‌ద్దు ద్వారా బీజేపీ రాజకీయంగా అతి పెద్ద త‌ప్పు చేసింద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. సాగు చ‌ట్టాల ర‌ద్దుతో రైతుల‌కు ఆదాయం పెరిగే అవ‌కాశాలు పోయాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

More Telugu News