కాకినాడ ఎమ్మెల్యేకి ఇంత అహంకారం ఎక్కడినుంచి వచ్చిందో అర్థంకావడంలేదు: నాదెండ్ల మనోహర్

19-03-2022 Sat 16:56
  • పవన్ ను టార్గెట్ చేసిన ద్వారంపూడి
  • వ్యక్తిగత విమర్శలు సరికాదన్న నాదెండ్ల
  • ఓటుతో ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టీకరణ
  • ద్వారంపూడిపై శశిధర్ గెలుస్తాడని ధీమా
Nadendla fires on Kakinada YCP MLA Dwarampudi
కాకినాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడిన మాటలు మీడియాలో చూశానని, ఎంతో ఆశ్చర్యం కలిగిందని నాదెండ్ల తెలిపారు. ఇంత అహంకారం ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు. 

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. తమ నాయకత్వాన్ని చులకనగా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని నాదెండ్ల స్పష్టం చేశారు. ద్వారంపూడి ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మాని, కాకినాడ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, అధికారంలో ఉన్నాం కదా అని ఏంమాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకుంటే పొరబాటేనని తెలిపారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయని, ప్రజలే ఓటుతో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. 

వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడి గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవని, ఆయనపై జనసేన అభ్యర్థి ముత్తా శశిధర్ గెలవడం ఖాయం అని నాదెండ్ల మనోహర్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో ద్వారంపూడి జనసేన వీరమహిళలను గాయపరిచారని, త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆ వీరమహిళలే ఇంటింటికీ వెళ్లి ప్రజల ద్వారా సరైన గుణపాఠం చెబుతారని తెలిపారు.