Stunts: త్రాచుపాములతో యువకుడి చెలగాటం.. చివరకు ఆసుపత్రి పాలు.. ఇదిగో వీడియో!

  • తోకలు పట్టుకుని ఆడించిన యువకుడు
  • ఎగిరి మోకాలిని కాటేసిన ఒక పాము
  • కర్ణాటకలోని సిర్సీలో ఘటన
  • ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స 
Youth stunts with 3 cobras ended very badly

పాములతో ఆట.. పులితో వేట.. చాలా డేంజర్. అలుసిచ్చాయని వాటితో స్టంట్లు చేస్తే.. ప్రాణాలూ పోతాయ్. అలాంటి ఘటనే కర్ణాటకకు చెందిన ఓ యువకుడికి జరిగింది. బారెడు పొడవున్న మూడు త్రాచుపాములను ముందు పెట్టుకుని.. వాటి తోకలను లాగుతూ చెలగాటమాడాడు. అందులో ఒక పాము కాస్తా ఎగిరి కాటేసింది. సదరు వ్యక్తి మోకాలి చిప్పను కరిచేసింది. అతడు ఎంత వదిలించుకుందామనుకున్నా ఆ పాము మాత్రం వదల్లేదు. 

చివరకు ఎలాగోలా దాని బారి నుంచి తప్పించుకున్నాడుగానీ.. ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఆ స్టంట్లు చేసిన వ్యక్తిని కర్ణాటకలోని సిర్సికి చెందిన మాజ్ సయ్యద్ గా గుర్తించారు. సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి అతడు పాములతో ఆడిన వీడియోను ట్వీట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. పాములతో ఇలాంటి ఆటలు చాలా ప్రమాదకరమైనవని ఆయన హెచ్చరించారు. మన చేతి కదలికలను పాములు అపాయంగా పరిగణిస్తాయని, దానికి ప్రతిగా ఆ పాములు ప్రతిస్పందిస్తే ప్రాణాంతకమవుతుందని చెప్పారు. 


అతడు ఆసుపత్రిపాలైన ఫొటోలను ప్రియాంక కదమ్ అనే పాముల పరిరక్షణ ఉద్యమకర్త.. ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. సిర్సీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ప్రస్తుతం అతడింకా తేరుకోలేదని తెలిపారు. సయ్యద్ స్టంట్లు వన్యప్రాణులను హింసించడమేనని, అతడిపై కేసు పెట్టాలని కోరిన ఆమె.. తర్వాత మనసు మార్చుకున్నారు. అతడితో మాట్లాడానని, చాలా నెమ్మదస్తుడని, అతడికి ఎవరైనా ఈ విషయంలో గైడ్ చేయాలని సూచించారు. మరోవైపు సయ్యద్ యూట్యూబ్ చానెల్ నిండా ఇలాంటి వీడియోలే ఉన్నట్టు తెలుస్తోంది. 

More Telugu News