Tamil Nadu: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ భేటీ.. రాజకీయ అరంగేట్రంపై చర్చ

  • హైదరాబాద్‌లో విజయ్-ప్రశాంత్ కిశోర్ రహస్య భేటీ!
  • రాజకీయాలపై సుదీర్ఘ చర్చ
  • విజయ్ పార్టీలోకి అన్నాడీఎంకే నేతలు!
  • తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశం
Kollywood Actor Vijay and Prashant Kishore meets in Hyderabad

తమిళ రాజకీయ యవనికపైకి మరో పార్టీ రాబోతోందా? కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, విజయ్ ఇటీవల హైదరాబాద్‌లో కలిశారన్నదే ఆ విషయం. రహస్యంగా భేటీ అయిన వీరిద్దరూ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయంపై విజయ్ సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ.. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారిపోయాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన డీఎంకేను ఎదురొడ్డడం అన్నాడీఎంకేకు దాదాపు అసాధ్యమని పేర్కొన్నారు. పార్టీ భవితవ్యం ఏంటో తెలియక ఆ పార్టీ నేతలు సతమతమవుతున్నారని, అలాగని వారు డీఎంకేలో చేరేందుకు ఇష్టపడడం లేదన్నారు. ఈ తరుణంలో విజయ్ కనుక కొత్త పార్టీ పెడితే అందులో చేరేందుకు వారందరూ సుముఖంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. 

మరోవైపు, రాజకీయాల్లోకి వస్తానని ఊరించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ తర్వాత దానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. దీంతో ఆయన అభిమానుల్లో కొందరు డీఎంకేలో చేరారు. మరికొందరు మాత్రం ఏ పార్టీలోనూ చేరలేదు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే వారంతా ఇప్పుడు ఇటువైపు మొగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందే విజయ్ పార్టీ పెట్టి బరిలోకి దిగితే  10 శాతం ఓట్లు వస్తాయని, ఫలితంగా డీఎంకే, అన్నాడీఎంకే తర్వాతి స్థానంలో విజయ్ పార్టీ నిలుస్తుందని చెబుతున్నారు. 

2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ పార్టీ నాయకత్వంలో మెగా కూటమిని ఏర్పాటు చేస్తే అధికారంలోకి రావడం తథ్యమని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే ప్రశాంత్ కిశోర్‌తో చర్చలు జరిపారని చెబుతున్నారు. తమిళనాడులో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కంకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు. గెలిచిన వారిని ఇంటికి పిలుపించుకున్న విజయ్ వారితో ఫొటోలు కూడా దిగారు. దీంతో ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రావడం తథ్యమన్న వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.

More Telugu News