Occult Practices: క్షుద్రపూజల్లో వాడిన నిమ్మకాయలు, కోడిగుడ్లు తింటే ఏమవుతుంది?... ఏమీ కాదని నిరూపించిన వరంగల్ పోలీసులు

  • ఇప్పటికీ భారత్ లో క్షుద్రపూజలు
  • కొన్నిచోట్ల నరబలులు
  • నగరాల్లోనూ అక్కడక్కడా మూఢాచారాలు
  • ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం చేసిన పోలీసులు
Warangal police performs people awareness program against occult practices

భారత్ లో ఇప్పటికీ మూఢనమ్మకాలు, క్షుద్ర ఆచారాలు, చేతబడులు కనిపిస్తుంటాయి. గ్రామాల్లోనే కాదు, నగరాల్లోనూ కొన్ని చోట్ల భూతవైద్యులు అమాయకులను మోసం చేస్తూ తమ పబ్బం గడుపుకుంటుంటారు. కొన్నిచోట్ల భయానక రీతిలో నరబలులు ఇచ్చిన ఘటనలు కూడా వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో, ప్రజల్లో క్షుద్రపూజలు, మూఢ భయాల పట్ల చైతన్యం కలిగించేందుకు వరంగల్ పోలీసులు నడుం బిగించారు. 

వరంగల్ లోని బట్టల బజార్ ఫ్లైఓవర్ పై కొందరు వ్యక్తులు కొన్ని ప్రత్యేకమైన దినాల్లో క్షుద్రపూజలు చేస్తున్నట్టు గుర్తించారు. రోడ్డుపై మంత్రించిన నిమ్మకాయలు, కోడిగుడ్లు, కొబ్బరికాయలు ఉండడంతో ఆ మార్గం గుండా వెళ్లే ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ విషయం తెలిసిన వరంగల్ పోలీసు అధికారులు ప్రజల్లో భయాందోళనలు తొలగించేందుకు ముందుకు వచ్చారు.

బట్టల బజార్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కనిపించిన నిమ్మకాయలు, కొబ్బరికాయలు, కోడిగుడ్లను సేకరించారు. నారాయణ అనే ఓ హోంగార్డు ముందుకు వచ్చి ఓ కోడిగుడ్డును మింగేశాడు... నిమ్మకాయలు కోసి రసం పిండుకుని తాగేశాడు... కొబ్బరికాయ పగులగొట్టి ఆ నీళ్లు తాగేశాడు. రోడ్డుపై ప్రజలందరి సమక్షంలో ఆ హోంగార్డు పైవిధంగా చేశాడు. తద్వారా పోలీసులు... క్షుద్రపూజల వల్ల ఏమీ కాదని, వాటిలో ఉపయోగించే వస్తువులు ఎలాంటి ప్రమాదం కలిగించవని చాటే ప్రయత్నం చేశారు.

More Telugu News