Nadendla Manohar: పోలీసులు విధుల్లో ఉన్నా వారి హృదయాల్లో పవన్ కల్యాణే ఉంటారు: నాదెండ్ల మనోహర్

Nadendla Manohar speech at Janasena formation day rally in Ippatam
  • ఇప్పటంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ
  • జగన్ అమరావతి నాశనానికి కృషి చేస్తున్నారన్న నాదెండ్ల 
  • విలువల్లేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శ 
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ మంగళగిరి నియోజకవర్గం ఇప్పటంలో జరుగుతోంది. ఈ సభలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, అమరావతి నాశనానికి జగన్ కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని విమర్శించారు. 

ఏపీ సంక్షేమ పథకాల్లో 30 నుంచి 40 శాతం మందికే లబ్ది చేకూరుతోందని, అందులోనూ అత్యధిక శాతం వైసీపీ వారికే లభిస్తున్నాయని వెల్లడించారు. సంక్షేమం పేరుతో విలువల్లేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భూకబ్జాలకు పాల్పడుతూ, లక్షల కోట్లు సంపాదిస్తున్నారని, చెరువులు తవ్వేస్తూ, నదీ పరీవాహక ప్రాంతాలను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. 

ఇవాళ తాము ఇప్పటం వద్ద ఏర్పాటు చేసిన సభకు ఇక్కడి రైతులు ఎంతగానో సహకరించారని, రైతులు సొంతంగా ట్రాక్టర్లపై వచ్చి సాయపడ్డారని నాదెండ్ల మనోహర్ కొనియాడారు. ఓ దశలో ఇదంతా ఎవరికోసం అన్న ఆలోచన వచ్చిందని, కనీసం పవన్ కల్యాణ్ ను కూడా గెలిపించుకోలేక ఆవేదన చెందామని వెల్లడించారు. 

పార్టీ ఏర్పాటు చేశాక అనేకమంది వచ్చారు, వెళ్లిపోయారు... కానీ ఇప్పటివరకు తమ వెంట ఉన్నది జనసైనికులు, వీరమహిళలేనని ఉద్ఘాటించారు. వారే పార్టీని నిలబెట్టారని కొనియాడారు. భారీగా సభ్యత్వాలు పెరగడంతో పార్టీ సంస్థాగత నిర్మాణం బలపడిందని వివరించారు. ఏపీ వ్యాప్తంగా 3 లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని తెలిపారు. 

"ఇవాళ్టి సభకు యువత పెద్ద సంఖ్యలో విచ్చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ను అడుగుతున్నా... ఈ మూడేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేశారు. కానీ నిరుద్యోగుల తరఫున జనసేన నిలబడింది. జాబ్ క్యాలెండర్ లో భాగంగా నోటిఫికేషన్ ఇమ్మని అడిగాం. 

ఇక్కడ పోలీసు వారు కూడా విధుల్లో ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించడం తప్ప వాళ్లేం చేయగలరు? వారు విధుల్లో ఉన్నా వారి హృదయాల్లో పవన్ కల్యాణే ఉంటారు. ఎందుకంటే పవన్ కల్యాణ్ గారు పోలీసు శాఖ గురించి, సిబ్బంది గురించి, పోలీసు అధికారుల గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. రాచరికపు ఏలుబడి తరహాలో ప్రభుత్వ పాలన ఉంటే పాపం పోలీసులు ఏం చేయగలరని పవన్ కల్యాణ్ అన్నారు. 50 వేల పోలీసు ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన జగన్ ఎన్ని పోస్టులు ఇచ్చారు? 450 పోస్టులు పోలీస్ శాఖకు ఇచ్చారు" అని వ్యాఖ్యానించారు. 

గత ఎన్నికల్లో తాము నిజాయతీగా పోటీ చేశామని, కానీ పనిగట్టుకుని, కొందరిని నియమించుకుని గ్రామగ్రామాల్లో తమపై దుష్ప్రచారం చేశారని నాదెండ్ల ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను సీఎంగా గెలిపించుకుందామని, జగన్ ఓటమే ప్రతి జనసైనికుడి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.
Nadendla Manohar
Janasena
Formation Day
Ippatam
Andhra Pradesh

More Telugu News