Imran Khan: ఆలూ, టమాటా ధరలను చెక్ చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదు: ఇమ్రాన్ ఖాన్

Didnt join politics to check prices of aloo tamatar says Pakistan PM Imran Khan
  • ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం
  • వ్యూహ రచన కోసం నేడు సమావేశం కానున్న ప్రతిపక్ష పార్టీలు
  • దేశ యువత కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న ఇమ్రాన్
  • తన మిగతా కాలంలో దేశం అద్భుత పురోగతి సాధిస్తుందన్న పీఎం
  • ప్రజలు సత్యం వెనక నిలబడాలని పిలుపు
ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు తనపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని హఫీజాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఇమ్రాన్ మాట్లాడుతూ..  డబ్బుతో చట్టసభ్యుల మనస్సాక్షిని కొనుగోలు చేయడం ద్వారా తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా దేశం నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఆలూ, టమాటా ధరలను నియంత్రించేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. తన మిగిలిన పాలనా కాలంలో పాకిస్థాన్ ఓ గొప్ప దేశంగా అవతరించబోతోందని అన్నారు. తమ ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు త్వరలోనే మంచి ఫలితాలు ఇస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

దేశ యువత కోసం రాజకీయాల్లోకి రావాలని 25 ఏళ్ల క్రితమే తాను నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఓ వ్యక్తి తన జీవితంలో కలలు కనే ప్రతీది తన వద్ద ఉందని, అవి నెరవేర్చడం వల్ల వ్యక్తిగతంతా తనకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. 

ఆలూ, టమాటా ధరలను తెలుసుకునేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. దేశ యువత కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. మనది గొప్ప దేశం కావాలంటే సత్యం వెనక నిలబడాలని అన్నారు. గత 25 ఏళ్లుగా తాను చెబుతున్నది ఇదేనని అన్నారు. ప్రతిపక్షాలు ఏకమై తనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.  

జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ నివాసంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నాయకులు నేడు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకుని ఇమ్రాన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సమర్థవంతమైన వ్యూహాన్ని రచించనున్నారు.
Imran Khan
Pakistan
Potato
Tomato
No Confidence Motion

More Telugu News