Wali: ఉక్రెయిన్ తరఫున పోరాడేందుకు వచ్చిన 'వాలి'... ఒక్కరోజులో ఆరుగురు రష్యన్ సైనికులను లేపేసిన 'స్నైపర్'!

World famous sniper Wali lands in Ukraine to fight againts Russian troops
  • ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
  • విదేశీయుల సాయం కోరిన జెలెన్ స్కీ
  • భార్య, పసికందును వదిలేసి యుద్ధరంగంలో దూకిన వాలి
  • గతంలో అనేక యుద్ధ రంగాల్లో పనిచేసిన వాలి
  • 3,540 మీటర్ల దూరంలోని జిహాదీని కాల్చిన వైనం
వాలి... ఇదొక అరబిక్ పదం. అయితే ఇప్పుడు మనం చర్చించుకోబోయే ఫ్రెంచ్-కెనడియన్ కంప్యూటర్ శాస్త్రవేత్త మారుపేరు ఇదే! వాలి అంటే అరబిక్ లో 'ఆపద్బాంధవుడు' అని అర్థం. సదరు ఫ్రెంచ్-కెనడియన్ కంప్యూటర్ సైంటిస్టుకు ఆ పేరు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే... ఎక్కడ యుద్ధం ఉన్నా, ఎక్కడ బలహీనుడు సాయం కోసం పిలుపునిచ్చినా 'వాలి' అక్కడ వాలిపోతాడు. గతంలో ఆఫ్ఘనిస్థాన్ కదనక్షేత్రంలో పెద్ద సంఖ్యలో శత్రువులను హతమార్చడంతో స్థానిక ప్రజలు అతడిని 'వాలి' అని పిలిచేవారు. 

తాజాగా, రష్యా దండయాత్రలకు అల్లాడిపోతున్న ఉక్రెయిన్ లోనూ 'వాలి' ప్రత్యక్షమయ్యాడు. 'వాలి'కి సైన్యంలో పనిచేసిన అనుభవం ఉంది. గతంలో రాయల్ కెనెడియన్ రెజిమెంట్ లో సేవలు అందించాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పిలుపు అందుకున్న 'వాలి' వెంటనే తన భార్య, నెలల పసికందును వదిలేసి యుద్ధరంగంలోకి దూకాడు. 

'వాలి' ప్రధానంగా స్నైపర్. స్నైపర్లు  దూరంగా ఉన్న శత్రువును టెలిస్కోపిక్ గన్ సాయంతో మట్టుబెడతారు. స్నైపర్ల వద్ద ఉండే రైఫిళ్లు అత్యంత శక్తిమంతమైనవి. కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ఛేదించగలవు. అయితే ఓ స్నైపర్ కు ఎంతో ఓపిక, గురి అవసరం. పైగా, పరిసరాల పట్ల అవగాహన కూడా ఉండాలి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధ రంగాల్లో 'వాలి' విజయవంతంగా శత్రు సంహారం చేశాడు. 

గత బుధవారం ఉక్రెయిన్ చేరుకున్న 'వాలి' ఇప్పటివరకు ఆరుగురు రష్యన్ సైనికుల్ని చంపేశాడని స్థానిక మీడియా వెల్లడించింది. సాధారణంగా స్నైపర్లు రోజుకు గరిష్ఠంగా 10 మందిని మట్టుబెట్టగలరు. అయితే 'వాలి' రోజుకు 40 మందిని లేపేయగల సత్తా ఉన్నవాడని అతడి గత రికార్డులు చెబుతున్నాయి. అంతేకాదు, 2017లో మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఐసిస్ జిహాదీని అత్యంత కచ్చితత్వంతో కాల్చి చంపాడు. ఇంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించిన స్నైపర్ 'వాలి' ఒక్కడే. 

'వాలి' ఇంతకుముందు ఆఫ్ఘనిస్థాన్, సిరియా, ఇరాక్ లో వివిధ దళాలతో కలిసి పనిచేశాడు. తాజా పరిస్థితులపై 'వాలి' స్పందిస్తూ, ఉక్రెయిన్ ప్రజలు యూరప్ తో కలవాలనుకుంటున్నారని, రష్యన్ ఏలుబడిలో రష్యన్లుగా ఉండకూడదని భావిస్తున్నారని వెల్లడించాడు. అందుకే ఉక్రెయిన్ ప్రజల తరఫున పోరాడేందుకు వచ్చానని తెలిపాడు.
.
Wali
Sniper
Ukraine
Russia
French-Canadian

More Telugu News