pm: గాంధీ నగర్ లో ప్రధానికి ఘన స్వాగతం.. పది కిలోమీటర్ల పొడవునా రోడ్డు షో

PMs Grand Roadshow In Gujarat After BJPs Stupendous Election Wins
  • రెండు రోజుల పాటు స్వరాష్ట్రంలో మోదీ పర్యటన
  • నేటి సాయంత్రం లక్ష మందితో పంచాయతీ మహా సమ్మేళన్
  • పలు అధికారిక కార్యక్రమాలకు ప్రధాని హాజరు
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించిన తర్వాత ప్రధాని మోదీ, శుక్రవారం గుజరాత్ పర్యటనకు రాగా.. పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. సొంత రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకు ప్రధాని గాంధీ నగర్ చేరుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనుండడంతో సొంత రాష్ట్రంపై మోదీ దృష్టి సారించనున్నారు. 

గాంధీ నగర్ సమీపంలోని విమానాశ్రయం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయం వరకు 10 కిలోమీటర్ల పొడవునా ఆయన ఓపెన్ టాప్ జీపులో రోడ్డు షో నిర్వహించారు. దారి పొడవునా భారీగా పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. విజయ చిహ్నంగా రెండు వేళ్లు పైకి చూపిస్తూ ఆయన ముందుకు సాగిపోయారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. 

నేటి సాయంత్రం 4 గంటలకు జరిగే గుజరాత్ పంచాయ్ మహా సమ్మేళన్ కార్యక్రమానికి హాజరవుతారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలోని మూడంచెల్లో భాగమైన లక్ష మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. రోడ్డు షోలో ప్రధాని వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ఉన్నారు.
pm
road show
gandhi nagar
gujarat

More Telugu News