ఉక్రెయిన్ పై యుద్ధం కోసం విదేశీ ఫైటర్లను నియమించుకుంటున్న రష్యా

07-03-2022 Mon 10:21
  • ఉక్రెయిన్ పై దాడిని తీవ్రతరం చేస్తున్న రష్యా
  • సిరియా, చెచెన్యా దేశాల ఫైటర్లను తీసుకుంటున్న వైనం
  • ఆరు నెలల పాటు ఉక్రెయిన్ లో పని చేసేలా నియామకాలు
Russia is recruiting fighters from Syria
ఉక్రెయిన్ పై రష్యా భారీ స్థాయిలో విరుచుకుపడుతోంది. గగనతలం నుంచి, భూమి మీద నుంచి రకరకాల ఆయుధాలతో భీకర యుద్ధాన్ని కొనసాగిస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే లక్ష్యంతో చేస్తున్న యుద్ధంలో రష్యా పైచేయిని సాధించినప్పటికీ పెద్ద సంఖ్యలో సైనికులను మాత్రం కోల్పోతోంది. ఎంతో మంది రష్యన్ సైనికులను ఉక్రెయిన్ బలగాలు మట్టుబెట్టాయి. మరెందరో రష్యన్ సైనికులు ఉక్రెయిన్ కు బందీలుగా చిక్కారు. 

మరోవైపు ఉక్రెయిన్ పై యుద్ధం చేయడానికి సిరియా ఫైటర్లను రష్యా నియమించుకుంటోంది. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో వెల్లడించింది. నలుగురు అమెరికా అధికారులు ఈ విషయాన్ని వెల్లడించినట్టు తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఎంత మంది సిరియా ఫైటర్లను రష్యా నియమించుకుందనే పక్కా సంఖ్యను మాత్రం పేర్కొనలేదు. చెచెన్యా వంటి ఇతర దేశాల ఫైటర్లను కూడా నియమించుకున్నట్టు సదరు పత్రిక తెలిపింది. ఆరు నెలల పాటు రష్యా తరపున ఉక్రెయిన్ లో పని చేయడానికి వీరిని నియమించుకుంటోంది.