Krishna District: రెండు నెలల క్రితం కరిచిన పిల్లి.. ఒకే రోజున ఇద్దరు మహిళల మృతి

Two women died due to cat bite after two months in krishna district
  • కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో ఘటన
  • పిల్లిని కుక్క కరిచి ఉంటుందని అనుమానం
  • రేబిస్‌తోనే వారు మరణించినట్టు చెప్పిన వైద్యులు
రెండు నెలల క్రితం ఓ పిల్లి ఇద్దరు మహిళలను కరవగా వారిద్దరు నిన్న మరణించడం కలకలం రేపింది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో జరిగిందీ ఘటన. స్థానిక దళితవాడలో నివసించే రిటైర్డ్ కండక్టర్ సాలి భాగ్యారావు భార్య కమలమ్మ, ప్రైవేటు వైద్యుడైన బొడ్డు బాబూరావు భార్య నాగమణిని రెండు నెలల క్రితం ఓ పిల్లి కరిచింది. వారు ఆసుపత్రికి వెళ్లగా టీటీ ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేశారు. దీంతో గాయాలు మానిపోయాయి. 

నాలుగు రోజుల క్రితం ఇద్దరిలోనూ మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కమల మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో, నాగమణి విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిద్దరిలో నాగమణి నిన్న తెల్లవారుజామున మృతి చెందగా, కమల నిన్న ఉదయం 10 గంటల సమయంలో మరణించింది. 

పిల్లిని కుక్క కరిచి ఉంటుందని, ఆ పిల్లి వీరిని కరవడంతో రేబిస్ సోకి వీరు మరణించారని వైద్యులు చెప్పినట్టు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, కమల, నాగమణిని కరిచిన పిల్లి ఆ తర్వాత మరణించినట్టు స్థానికులు చెప్పారు. ఈ ఘటనపై స్థానిక ఆరోగ్యకేంద్రం అధికారులు మాట్లాడుతూ.. పిల్లి, కుక్క, ఎలుక, పాము లాంటివి ఏవి కరిచినా నిర్లక్ష్యం చేయకూడదని, వెంటనే సమీప ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు.
Krishna District
Movva
Cat
Dog
Bite

More Telugu News