Shane Warne: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం

Australian cricket legend Shane Warne is no more
  • థాయ్ లాండ్ లో కన్నుమూసిన వార్న్
  • తన విల్లాలో విగతజీవుడిలా కనిపించిన వైనం
  • వైద్య సిబ్బంది ప్రయత్నాలు విఫలం
  • గుండెపోటుకు గురయ్యుంటాడని అనుమానం
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం చెందాడు. ఆయన వయసు 52 సంవత్సరాలు. వార్న్ గుండెపోటుకు గురైనట్టు భావిస్తున్నారు. వార్న్ మేనేజ్ మెంట్ సంస్థ ఈ మేరకు క్లుప్తంగా ఓ ప్రకటన చేసింది. థాయ్ లాండ్ లోని కోహ్ సముయ్ ప్రాంతంలో విహారయాత్రలో ఉండగా వార్న్ మృతి చెందాడన్నది ఆ ప్రకటన సారాంశం. 

అక్కడి తన విల్లాలో విగతజీవిగా పడివున్న వార్న్ ను గుర్తించారని, వైద్య సిబ్బంది చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో వార్న్ కుటుంబాన్ని ఎవరూ ఇబ్బంది పెట్టొద్దని, వారి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని, మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని వివరించారు. 

ఆస్ట్రేలియా క్రికెట్ లో ఇవాళ రెండు విషాద ఘటనలు జరిగాయి. ఈ ఉదయం ఆసీస్ వికెట్ కీపింగ్ దిగ్గజం రాడ్నీ మార్ష్ కన్నుమూశారు. మార్ష్ తీవ్ర గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మార్ష్ మృతికి సంతాపసూచకంగా... పాకిస్థాన్ తో తొలి టెస్టు సందర్భంగా ఆసీస్ ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు కట్టుకుని బరిలో దిగారు. ఇప్పుడు లెగ్ స్పిన్ దిగ్గజం వార్న్ మరణంతో ఆస్ట్రేలియన్ క్రికెట్ నిర్ఘాంతపోయింది. 

ఆస్ట్రేలియా జట్టు 90, 2000వ దశకాల్లో సాధించిన విజయాల్లో వార్న్ పాత్ర ఎనలేనిది. ఐపీఎల్ తోనూ వార్న్ కు ఎంతో అనుబంధం ఉంది. ఐపీఎల్ 2008లో ప్రారంభం కాగా, తొలి ఎడిషన్ లో రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలవగా, ఆ సమయంలో రాజస్థాన్ కు వార్న్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆపై ఐపీఎల్ లో కోచ్ గానూ కొనసాగాడు. 15 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లు సాధించి ఆల్ టైమ్ గ్రేట్స్ లో ఒకడిగా పేరుగాంచాడు. 

షేన్ వార్న్ అంతర్జాతీయ కెరీర్ టీమిండియాపైనే ప్రారంభం అయింది. 1992లో వార్న్ కెరీర్ షురూ కాగా, తొలి మ్యాచ్ లో వార్న్ బౌలింగ్ ను భారత బ్యాట్స్ మెన్ అలవోకగా ఆడారు. ఒక ఇన్నింగ్స్ లో వార్న్ ఏకంగా 200కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. కానీ ఆ తర్వాత కాలంలో దేశాలు, పిచ్ లతో సంబంధం లేకుండా బంతిని సుడులు తిప్పుతూ మహోన్నత లెగ్ స్పిన్నర్ గా ఎదిగాడు. వార్న్ 194 వన్డేల్లో 293 పైగా వికెట్లు తీశాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 1000కి పైగా వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర పుటల్లోకెక్కాడు. 

క్రికెట్ లో ఓ బ్యాట్స్ మన్ సెంచరీ చేస్తే గొప్పగా భావిస్తారు. అదే ఓ బౌలర్ 5 వికెట్లు తీస్తే అది సెంచరీతో సమానం. అలాంటిది వార్న్ ఏకంగా 37 సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం.  

ముఖ్యంగా, ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం మైక్ గ్యాటింగ్ కు లెగ్ స్టంప్ కు ఆవల బంతిని వేసి అతడి ఆఫ్ స్టంప్ ను గిరాటేయడం ఇప్పటికీ క్రికెట్ ప్రేమికుల మదిలో కదలాడుతూనే ఉంటుంది. ఈ శతాబ్దపు అత్యుత్తమ బంతిగా ఆ డెలివరీ గురించి చెప్పుకుంటారు.
Shane Warne
Demise
Leg Spinner
Australia

More Telugu News