Samantha: ఆనాటి సంఘటనతో ఎంతో కుంగిపోయాను... ఆ సమయంలో నువ్వొచ్చావు: నందిని రెడ్డిపై సమంత ఎమోషనల్ పోస్టు

Samantha emotional post on Nandini Reddy birthday
  • దర్శకురాలు నందినిరెడ్డితో సమంత దోస్తీ
  • నేడు నందినిరెడ్డి పుట్టినరోజు
  • 2012 నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్న సమంత
  • ఆ సమయంలో ఆత్మవిశ్వాసం కోల్పోయానని వెల్లడి
  • నందిని తనలో స్ఫూర్తి నింపిందని వివరణ
దక్షిణాది చిత్రసీమలో ప్రతిభావంతులైన నటీమణుల్లో సమంత ఒకరు. ఏ పాత్ర పోషించినా అందులో లీనమైపోయి నటించే సమంతకు అనేక భాషల్లో పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. ఇటీవలే తన వ్యక్తిగత జీవితంలో అతిపెద్ద కుదుపును ఎదుర్కొంది. నాగచైతన్యతో వైవాహిక జీవితానికి సమంత ముగింపు పలికింది. 

ఇక అసలు విషయానికొస్తే... సమంతకు టాలీవుడ్ లో ఫ్రెండ్స్ కు కొదవలేదు. దర్శకురాలు నందిని రెడ్డి కూడా సమంతకు బెస్ట్ ఫ్రెండ్. ఇవాళ నందిని రెడ్డి పుట్టినరోజు కావడంతో సమంత ఎమోషనల్ గా స్పందించింది. 2012లో జరిగిన ఓ సంఘటనతో తాను ఎంతో కుంగిపోయానని సమంత వెల్లడించింది. కెరీర్ ఇక ముందుకు సాగదన్న బలమైన నిర్ణయానికి వచ్చానని, అసలు ఆత్మవిశ్వాసం అన్నదే లేకుండా పోయిందని తెలిపింది. 

అలాంటి సమయంలో నందిని రెడ్డి వచ్చిందని, తనలో ఎంతో ధైర్యం నింపిందని సమంత వెల్లడించింది. నందిని రెడ్డి మాటలు తనను మామూలు మనిషిగా మార్చాయని, ఆనాడు నందినిరెడ్డి కలిగించిన స్ఫూర్తితో ఆ మరుసటి రోజే సినిమా రంగానికి పునరంకితం అయ్యానని వివరించింది. 

"ఎంతో బిజీ షెడ్యూల్ లోనూ నాకోసం సమయం కేటాయించి మాట్లాడావు. నాలో నాపై నమ్మకం కలిగించేందుకు టెస్ట్ షూట్ ఏర్పాటు చేశావు. నందినిరెడ్డి నువ్వు అందించిన స్ఫూర్తిని ఎప్పటికీ మరువలేను. ఇది మచ్చుకు ఒక్క సంఘటనే. చాలా సమయాల్లో నాకు మద్దతుగా నిలిచావు. నీకు జన్మదిన శుభాకాంక్షలు" అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతేకాదు, నందినిరెడ్డితో కలిసి ఉన్నప్పటి ఫొటోలను కూడా సమంత పంచుకుంది.
.
Samantha
Nandini Reddy
Birthday
Friendship
Tollywood

More Telugu News