Team India: శ్రీలంకతో మొదటి టెస్టు: ముగిసిన తొలిరోజు ఆట... తలో చేయి వేసిన టీమిండియా బ్యాట్స్ మెన్

Batsmen collective effort takes India towards huge total
  • మొహాలీలో భారత్, శ్రీలంక మధ్య టెస్టు మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
  • ఆట చివరికి 6 వికెట్లకు 357 పరుగుల స్కోరు
  • 96 పరుగులు చేసి అవుటైన పంత్
  • రాణించిన విహారి, కోహ్లీ, జడేజా
టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మొహాలీలో ఇవాళ ప్రారంభమైన మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆట చివరికి టీమిండియా 6 వికెట్లకు 357 పరుగులు చేసింది. ఓపెనర్ల నుంచి ఆల్ రౌండర్ల వరకు తలో చేయి వేయడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ మరోసారి అద్భుతంగా ఆడాడు. పంత్ 97 బంతుల్లోనే 96 పరుగులు చేశాడు. అతడి స్కోరుతో 9 ఫోర్లు, 4 భారీ సిక్సులున్నాయి. సెంచరీకి 4 పరుగుల దూరంలో పంత్... లక్మల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29) తొలి వికెట్ కు 52 పరుగులు జోడించి శుభారంభం అందించారు. వన్ డౌన్ లో వచ్చిన తెలుగుతేజం హనుమ విహారి ఎంతో ఓపికగా ఆడి అర్ధసెంచరీ నమోదు చేశాడు. లంక బౌలర్లు ఊపుమీదున్న దశలో బరిలో దిగిన విహారి 128 బంతులు ఎదుర్కొని 58 పరుగులు చేశాడు. 

ఇక, 100వ టెస్టు ఆడుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 45 పరుగులకు అవుటయ్యాడు. కోహ్లీని లంక స్పిన్నర్ ఎంబుల్దెనియా బౌల్డ్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 27 పరుగులు చేసి ధనంజయ డిసిల్వా బౌలింగ్ లో వెనుదిరగ్గా, క్రీజులో రవీంద్ర జడేజా 45 పరుగులతోనూ, రవిచంద్రన్ అశ్విన్ 10 పరుగులతోనూ ఆడుతున్నారు. 

శ్రీలంక బౌలర్లలో ఎంబుల్దెనియా 2 వికెట్లు తీయగా, లక్మల్, విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార, ధనంజయ డిసిల్వ తలో వికెట్ తీశారు.
Team India
Sri Lanka
First Test
Day1
Mohali

More Telugu News