Andhra Pradesh: అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలి.. రాజధానిపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదు: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

  • సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ను 6 నెలల్లోగా పూర్తి చేయాలి
  • భూములిచ్చిన రైతులకు 3 నెలల్లోగా ప్లాట్లు ఇవ్వాలి
  • అమరావతి నుంచి ఆఫీసులను తరలించడానికి వీల్లేదు
  • రాజధాని అంశంలో 75 వ్యాజ్యాలపై హైకోర్టు కీలక తీర్పు
Assembly Has No Power To make Laws On Capital AP High Court Delivers Verdict

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని ఆదేశించింది. 6 నెలల్లోగా మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మూడు రాజధానుల ఏర్పాటు, రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దుపై దాఖలైన 75 వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పునిచ్చింది.  

రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. అమరావతి నుంచి ఆఫీసులను తరలించకూడదని స్పష్టం చేసింది. భూములను ప్రభుత్వానికిచ్చిన రైతులు, వాటాదారులకు 3 నెలల్లోగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరచిన ప్లాట్లను అప్పగించాలని సర్కారుకు తేల్చి చెప్పింది. 

రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు ఆ భూములను తాకట్టు పెట్టరాదని స్పష్టం చేసింది. అమరావతి రాజధానిపై వ్యాజ్యాలు దాఖలు చేసిన పిటిషనర్లకు ఖర్చుల కింద రూ.50 వేల చొప్పున చెల్లించాల్సిందిగా సర్కారును కోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో అమరావతి రైతుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. 

వాస్తవానికి ఏపీ సీఆర్డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ (మూడు రాజధానుల) చట్టాలను సవాల్ చేస్తూ రాజధాని రైతులతో పాటు ఇంకొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఆ చట్టాలను సర్కారు రద్దు చేసింది.  

అయితే, మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసినా తమకు ఇంకా కొన్ని అభ్యంతరాలున్నాయని, వాటిపై విచారణ చేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ను అమలు చేసేలా, భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసిచ్చేలా చూడాలని కోరారు. 

అయితే, మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిన నేపథ్యంలో.. దాఖలైన వ్యాజ్యాలపై విచారణ అవసరం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఫిబ్రవరి 4న వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలోనే 75 పిటిషన్లపై ఇవాళ వేర్వేరు తీర్పులను వెలువరించింది.

More Telugu News