Telangana: సాంకేతిక కారణాల వ‌ల్లే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేదు: తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి

  • గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంతో స‌మావేశాల‌ను మొదలెట్టాల‌ని రాజ్యాంగంలో ఉందా?
  • రాష్ట్రప‌తి ప్ర‌సంగం లేకుండా పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కాలేదా?
  • గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేక‌పోవ‌డానికి రాజ‌కీయ కార‌ణాలేమీ లేవన్న మంత్రి  
minister prashanth reddy statement on assembly budget sessions

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈ ద‌ఫా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే మొద‌లు కానున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండ‌గా... గతంలో తమిళనాడు బీజేపీలో కీలక నేత అయిన మ‌హిళ ఇక్కడ గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్య‌తిరేకంగా కూట‌మి క‌ట్టే దిశ‌గా సీఎం కేసీఆర్ సాగుతున్నారు. 

ఈ క్ర‌మంలో టీఆర్ఎస్‌, బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం ఓ రేంజిలో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార‌ణంగానే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని స్కిప్ చేస్తూ టీఆర్ఎస్ స‌ర్కారు ప్లాన్ వేసింద‌ని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. దీనిపై అసెంబ్లీ సభా వ్య‌వ‌హారాల మంత్రిగా ఉన్న ప్ర‌శాంత్ రెడ్డి దీనిపై వివ‌ర‌ణ ఇచ్చారు. ప‌నిలో ప‌నిగా బీజేపీపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.

కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల్లే ఈ ద‌ఫా అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేద‌ని ప్ర‌శాంత్ రెడ్డి చెప్పారు. ఇందులో రాజ‌కీయ ప‌క్ష‌పాతం ఏమీ లేద‌ని కూడా ఆయ‌న తెలిపారు. అయినా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స‌మావేశాలు మునుప‌టి స‌మావేశాల‌కు కొన‌సాగింపేన‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. 

అయినా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంతోనే అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను ప్రారంభించాల‌ని రాజ్యాంగంలో ఎక్క‌డైనా ఉందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇదివ‌ర‌కు రాష్ట్రప‌తి ప్ర‌సంగం లేకుండానే పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాలు మొద‌లయ్యాయి క‌దా? అని కూడా ఆయ‌న గుర్తు చేశారు. గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విలో బీజేపీ నేత ఉంటే.. తాము చేసిన అభివృద్ధిని ఆ బీజేపీ నేత నోటితోనే అసెంబ్లీలో చెప్పించేవాళ్లం క‌దా? అని కూడా ప్ర‌శాంత్ రెడ్డి అన్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేక‌పోవడానికి రాజ‌కీయ కార‌ణాలేమీ లేవ‌ని, కేవ‌లం సాంకేతిక కార‌ణాల‌తోనే ఈ ద‌ఫా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌వుతున్నాయని ఆయ‌న వివ‌రించారు.

More Telugu News