Sri Lanka: రెండో టీ20లోనూ భారత్‌దే విజయం.. సిరీస్ వశం

India won t20 series against sri lanka
  • వరుసగా  8వ మ్యాచ్‌లోనూ భారత జట్టు విజయం
  • మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ భారత్ కైవసం
  • నేడు ధర్మశాలలో తుది టీ20

అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. గత రాత్రి ధర్మశాలలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఇది వరుసగా ఎనిమిదో విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక చెలరేగింది. ఓపెనర్ నిశ్శంక 53 బంతుల్లో 11 ఫోర్లతో 75 పరుగులతో చెలరేగడానికి తోడు చివర్లో కెప్టెన్ దాసున్ షనక (47) 19 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరో ఓపెనర్ గుణతిలక 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేయడంతో శ్రీలంక తొలుత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోరు సాధించి భారత్‌కు సవాలు విసిరింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, బుమ్రా, హర్షల్ పటేల్, చాహల్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 184 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మరో 17 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క పరుగుకే బౌల్డ్ కాగా, మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (16) కూడా విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 44 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. సంజు శాంసన్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. 

శాంసన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా లంక బౌలర్లపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డాడు. 18 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 45 పరుగులు చేసి జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. ఈ విజయంతో సిరీస్ భారత్ వశమైంది. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార 2 వికెట్టు పడగొట్టగా, చమీర ఒక వికెట్ తీసుకున్నాడు. బ్యాటింగులో ఇరగదీసిన శ్రేయాస్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. భారత్-శ్రీలంక మధ్య చివరి టీ20 కూడా నేడు ధర్మశాలలోనే జరగనుంది.

  • Loading...

More Telugu News