Russia: ఈయూ ఆంక్షలతో ఫ్రెంచ్ గయానా నుంచి రాకెట్ ప్రయోగాలు రద్దు చేసుకున్న రష్యా

Russia cancels space explorations from French Guiana due to EU latest sanctions
  • ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దాడులు
  • ఇప్పటికే రష్యా సంస్థలు, బ్యాంకులు, కుబేరులపై ఆంక్షలు
  • తాజాగా పుతిన్, విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఆస్తుల స్తంభన
  • ఈయూ సభ్యదేశాల ఆమోదం

ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యాపై ప్రత్యక్ష సైనిక చర్యకు దిగే సాహసం చేయలేకపోతున్న ప్రపంచ దేశాలు ఆర్థిక ఆంక్షల రూపంలో తమ ప్రతిస్పందన వెలిబుచ్చుతున్నాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ (ఈయూ) రష్యాపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రెంచ్ గయానా నుంచి తమ రాకెట్ ప్రయోగాలని రద్దు చేసుకుంది. 

దీనిపై రష్యన్ స్పేస్ ఏజెన్సీ రాస్ కాస్మోస్ డైరెక్టర్ జనరల్ దిమిత్రీ రోగోజిన్ ట్వీట్ చేశారు. "రష్యా సంస్థలపై ఈయూ ఆంక్షలు విధించింది. దాంతో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి యూరప్ లోని ఇతర భాగస్వామ్య దేశాలకు సహకారం నిలిపివేస్తున్నాం. ఫ్రెంచ్ గయానాలోని కౌరూ కాస్మోడ్రోమ్ నుంచి రష్యా సాంకేతిక నిపుణులను, రాకెట్ ప్రయోగ సిబ్బందిని వెనక్కి పిలిపిస్తున్నాం" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో, ఇప్పటికే రష్యా సంస్థలు, సంపన్నులు, బ్యాంకుల లావాదేవీలపై ఈయూ ఆంక్షలు ప్రకటించింది. దాంతోపాటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ల ఆస్తుల స్తంభనకు కూడా ఈయూ ఆమోదం తెలిపింది. వీరిద్దరిపై కఠిన ఆంక్షలకు ఈయూలోని 27 సభ్య దేశాల రాయబారులు ముక్తకంఠంతో అంగీకారం తెలిపారు.

  • Loading...

More Telugu News