AP Govt: ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన తెలుగువారి కోసం ఏపీ ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే!

AP Govt establish help line numbers for Telugu people who stranded in Ukraine
  • ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యా
  • చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు
  • కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు సీఎం జగన్ ఆదేశం
  • విదేశాంగ మంత్రి జైశంకర్ తో మాట్లాడిన సీఎం జగన్
రష్యా యుద్ధానికి దిగడంతో ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో, స్వదేశానికి వచ్చే మార్గం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, వారికి సహాయపడేందుకు, స్వదేశంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.

దీనిపై ఏపీ సీఎస్ సమీర్ శర్మ మాట్లాడుతూ, సీఎం జగన్ ఆదేశాల మేరకు ఉక్రెయిన్ లోని తెలుగు వారి కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. కృష్ణబాబు, గీతేశ్ శర్మ, అరుణ్ కుమార్, ఏ.బాబు, దినేశ్ కుమార్ లతో కూడిన బృందం కంట్రోల్ రూమ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందని సీఎస్ వెల్లడించారు.

తగిన సమాచారం కోరే వారు 1902కి కాల్ చేసి వివరాలు చెప్పాలని తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటి నెంబర్లు 48660460814, 48606700105 అని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు ఇప్పటికే 1000 మంది తెలుగు విద్యార్థులు ఫోన్ చేశారని సమీర్ శర్మ తెలిపారు.

కాగా, ఏపీ సీఎం జగన్ ఉక్రెయిన్ లోని తెలుగు విద్యార్థుల క్షేమం కోసం విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ తో మాట్లాడారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వారి పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామని సీఎం జగన్ కేంద్రమంత్రితో చెప్పారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి జైశంకర్ సీఎం జగన్ కు భరోసానిచ్చారు. ఉక్రెయిన్ లో నిలిచిపోయిన భారత విద్యార్థులందరినీ భద్రంగా తీసుకువస్తామని అన్నారు. వారిని ఉక్రెయిన్ పొరుగు దేశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. తద్వారా వారిని భారత్ తీసుకువచ్చేందుకు వీలవుతుందని వివరించారు.
AP Govt
Helpline Numbers
Control Room
Telugu People
Students
Ukraine
Russia

More Telugu News