Perni Nani: జ‌గ‌న్‌ను క‌లుస్తాన‌ని బాల‌కృష్ణ అన్నారు: మంత్రి పేర్ని నాని

ap minister perni nani says Balakrishna wish to meet Jagan
  • అఖండ నిర్మాత‌లు నా వ‌ద్ద‌కు వ‌చ్చారు
  • బాల‌కృష్ణ‌తో ఫోన్‌లో మాట్లాడించారు
  • జ‌గ‌న్‌ను క‌లుస్తాన‌ని బాల‌కృష్ణే అన్నారు
  • అయితే వేరే విధంగా ప్ర‌చార‌మ‌వుతుంద‌ని జ‌గ‌నే వ‌ద్ద‌న్నారన్న నాని 
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజా చిత్రం భీమ్లా నాయ‌క్ విడుద‌ల పుణ్యమా అని కొత్త కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని తాను క‌లిసే ప్ర‌సక్తే లేద‌ని టాలీవుడ్ అగ్ర హీరో, టీడీపీ కీల‌క నేత‌, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ అన్నార‌ని గ‌తంలో ఓ వార్త చ‌క్క‌ర్లు కొట్టిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఆ వార్త అస‌త్య‌మ‌ని.. జ‌గ‌న్‌ను క‌లుస్తాన‌ని స్వ‌యంగా బాల‌కృష్ణే త‌న‌తో చెప్పార‌ని ఇప్పుడు ఏపీ మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాకుండా బాల‌కృష్ణ అబ‌ద్ధం ఆడ‌తార‌ని తాను అనుకోవ‌డం లేదంటూ నాని ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. భీమ్లా నాయ‌క్ చిత్రాన్ని ఏపీ ప్ర‌భుత్వం అడ్డుకుంటోంద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంపై మాట్లాడేందుకు శుక్ర‌వారం మీడియా ముందుకు వ‌చ్చిన నాని.. బాల‌కృష్ణ అంశాన్ని ప్ర‌స్తావించారు.

ఈ సంద‌ర్భంగా నాని మాట్లాడుతూ.. "హైదరాబాద్ లో ఉన్న బిల్డర్ నారాయణ ప్రసాద్ ద్వారా, నూజివీడు ఎమ్మెల్యే ద్వారా ‘అఖండ’ నిర్మాతలు సినిమా విడుదలకు ముందు న‌న్ను కలవడానికి విజయవాడ వచ్చారు. అదే సమయంలో వారు హీరో బాలకృష్ణతోనూ ఫోన్ లో మాట్లాడించారు. జగన్ ను కలుస్తానని బాలకృష్ణ చెప్పారు.

అదే విషయాన్ని నేను సీఎం జగన్ కు తెలిపాను. అయితే ‘అఖండ’ సినిమాకు సంబంధించి బాలకృష్ణ నిర్మాతలకు పూర్తి సహకారం అందించమని జగన్ నాకు చెప్పారు. బాలకృష్ణ తనను కలిస్తే అది వేరే విధమైన ప్రచారానికి కారణమౌతుందని జ‌గ‌న్‌ అన్నారు. అప్పుడు సీఎం జగన్ ను కలుస్తానని చెప్పిన బాలకృష్ణ ఇప్పుడు కలవనని చెబుతారని నేను అనుకోవడం లేదు. బాలకృష్ణ అబద్ధం చెబుతారని కూడా భావించడం లేదు" అంటూ నాని చెప్పుకొచ్చారు.
Perni Nani
nandamuri balakrishna
akhanda
YS Jagan

More Telugu News