Chandrababu: ఉక్రెయిన్ లో తెలుగు వాళ్ల పరిస్థితి పట్ల చంద్రబాబు ఆందోళన... కేంద్రమంత్రి జైశంకర్ కు లేఖ

Chandrababu wrote union minister Jai Shankar to evacuate Telugu students from Ukraine
  • ఉక్రెయిన్ పై రష్యా వార్
  • దిక్కుతోచని స్థితిలో తెలుగు విద్యార్థులు
  • దాదాపు 4 వేల మంది వరకు ఉన్నారన్న చంద్రబాబు
  • క్షేమంగా తీసుకురావాలని కేంద్రానికి విజ్ఞప్తి
ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం నెలకొని ఉండడంతో తెలుగు వాళ్లు బిక్కుబిక్కుమంటున్నారు. ముఖ్యంగా విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రష్యా సైనిక దాడులు ఎప్పుడు ఆగుతాయో తెలియక, ఉక్రెయిన్ కు బయటి దేశాల నుంచి విమానాలు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేక తెలుగు వాళ్లు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.

ఉక్రెయిన్ లో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల కారణంగా 4 వేల మంది వరకు తెలుగు విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు చిక్కుకుపోయారని వెల్లడించారు. ముఖ్యంగా, ఒడెస్సా, కీవ్ వంటి ముఖ్య నగరాల్లో ఉన్న తెలుగు వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, చేతిలో డబ్బు లేక, నిత్యావసరాలు దొరక్క, తమను పట్టించుకునేవాళ్లు లేక అల్లాడిపోతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను, ముఖ్యంగా తెలుగు విద్యార్థులు, నిపుణులను తక్షణమే స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేయాలని కోరుతూ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కు లేఖ రాశారు.

"కరోనా సంక్షోభ సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశంలోని వారి అయినవారి వద్దకు మీరు చేర్చిన విధానం ఇప్పటికీ మా మదిలో నిలిచే ఉంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం నెలకొని ఉండడంతో 4 వేల మంది వరకు తెలుగు వాళ్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏటీఎంల నుంచి డబ్బులు రాకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతం. ఆహారం కోసం అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీవ్, ఒడెస్సా నగరాల్లో యూనివర్సిటీలు, కార్యాలయాలు మూసివేయడంతో తెలుగు వాళ్లు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు.

ఇతర భారతీయులతో కలిసి కీవ్ ఎయిర్ పోర్టు వద్ద ఓ విమానం ఎక్కేందుకు తెలుగు వారు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఓ పాఠశాలలో వారికి భారత ఎంబసీ ఆశ్రయం కల్పించినట్టు తెలిసింది. భారత్ లోని వారి కుటుంబ సభ్యులు ఉక్రెయిన్ పరిస్థితుల గురించి తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ లో నిలిచిపోయిన తెలుగు వాళ్లను క్షేమంగా తీసుకురావాలని కోరుతున్నాం. తద్వారా భారత్ లోని వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఊరట కలిగించినవాళ్లవుతారు" అంటూ చంద్రబాబు తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
Chandrababu
Jai Shankar
Telugu Students
Ukraine
Russia

More Telugu News