Virat Kohli: అందుకే బెంగళూరు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. పెదవి విప్పిన విరాట్ కోహ్లీ

  • గత ఐపీఎల్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేసిన కోహ్లీ
  • భారంగా అనిపించే పనిని చేయాలని అనుకోను
  • చేయగలనని అనుకున్నా ఆస్వాదించలేనప్పుడు కొనసాగించలేను
  • ‘స్పేస్’ కావాలనుకునే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నానన్న కోహ్లీ 
There is nothing to be shocked about  Virat Kohli reveals reason behind stepping down as RCB captain

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారథ్యం వహిస్తున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ గతేడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత చేసిన ప్రకటన అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

ఆ తర్వాత వరుసగా టీమిండియా టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పగా, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత టెస్టు జట్టు కెప్టెన్సీ కూడా రామ్‌రామ్ చెప్పేశాడు. వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి బోర్డు తప్పించేసింది. ఇవన్నీ వరుసగా జరగడంతో కోహ్లీ కెరియర్ ప్రమాదంలో పడిందన్న ప్రచారం జరిగింది.

ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ అందుకు గల కారణాలను మాత్రం కోహ్లీ అప్పుడు వెల్లడించలేదు. కోహ్లీ నిర్ణయాన్ని అప్పట్లో ఆర్సీబీ కూడా స్వాగతించింది. తాజాగా, పెదవి విప్పిన కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. తనకు భారంగా అనిపించే పనిని చేయాలని తాను అనుకోనని, ఒకవేళ చేయగలనని భావించినా దానిని తాను ఆస్వాదించలేనప్పుడు కొనసాగించలేనని చెప్పుకొచ్చాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదన్నాడు.

క్రికెటర్లు తీసుకునే నిర్ణయాలను అర్థం చేసుకోవడానికి ప్రజలకు కొంత సమయం పడుతుందని అన్నాడు. బయటి నుంచి చూసే వాళ్లకు క్రికెటర్లు తీసుకునే నిర్ణయాలు కొంత ఆశ్చర్యకరంగా అనిపిస్తాయని, ‘ఇదేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు?’ అని అనుకుంటారని, కానీ తమ వైపు నుంచి ఆలోచిస్తేనే తమ నిర్ణయం వెనకున్న పరమార్థం అర్థమవుతుందని అన్నాడు.

తనకు స్పేస్ కావాలని అనుకున్నానని, అందుకనే ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నానని వివరించాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. ఎన్ని ఎక్కువ మ్యాచులు ఆడామన్నది ముఖ్యం కాదని, తక్కువ మ్యాచుల్లోనే అయినా ఎంత ఎక్కువ సాధించామన్నదే ముఖ్యమని కోహ్లీ పేర్కొన్నాడు. ఆర్సీబీకి కెప్టెన్‌గా జట్టును గెలిపించే ప్రయత్నం చేశానని వివరించాడు.

More Telugu News