Pawan Kalyan: తెలంగాణ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు: పవన్ కల్యాణ్

Pawan Kalyan thanked Telangana police
  • హైదరాబాదులో నిన్న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక
  • పోలీసులు ఎంతో సహకరించారన్న పవన్
  • ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూశారని ప్రశంస 
హైదరాబాదులో బుధవారం భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ నేడు ఓ ప్రకటన చేశారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, జనసామాన్యానికి అవాంతరాలు లేకుండా చేయడంలో, ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో తెలంగాణ పోలీసులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని అభినందించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ సాఫీగా జరగడంలో ఎంతో శ్రమించారని కొనియాడారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్, వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పీఎస్ ల పరిధిలోని పోలీసు అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పవన్ వివరించారు.

అంతేకాకుండా, ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేసేలా లైవ్ కవరేజీలు, వార్తా కథనాలు అందించిన పాత్రికేయులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ వేడుకలో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొని క్రమశిక్షణతో మెలిగిన అభిమానులకు అభినందనలు తెలుపుకుంటున్నానని, వారు ఇదే క్రమశిక్షణను, స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
Pawan Kalyan
Police
Telangana
Bheemla Nayak
Pre Release Evenr
Hyderabad
Tollywood

More Telugu News