Ursula von der Leyen: రష్యా అసలు లక్ష్యం వేరే ఉంది: యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్

European Commission says Russia wants to destroy stability in Europe
  • ఉక్రెయిన్ పై ఆక్రణమకు దిగిన రష్యా
  • ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై క్షిపణుల వర్షం
  • ఆంక్షలకు సిద్ధమైన యూరోపియన్ యూనియన్
  • పుతిన్ బాధ్యత వహించాలన్న యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు
ఉక్రెయిన్ పై రష్యా దాడి ఆటవిక చర్య అని యూరోపియన్ యూనియన్ అభివర్ణించింది. రష్యా దురాక్రమణకు దిగిందని, రష్యాపై గతంలో ఎన్నడూలేనంత కఠిన చర్యలు తప్పవని ఈయూ నేతలు స్పష్టం చేశారు. రష్యా ఆస్తులను స్తంభింపజేయడం, యూరప్ ఆర్థిక విపణుల్లో రష్యా బ్యాంకుల లావాదేవీల నిలిపివేత, రష్యా ప్రభుత్వ ప్రయోజనాలకు సహాయకారిగా నిలిచే ఆర్థిక లావాదేవీల అడ్డగింత వంటి చర్యలు తీసుకుంటామని యూరోపియన్ యూనియన్ కు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.

రష్యా ఇవాళ భీకరస్థాయిలో ఉక్రెయిన్ లోని పలు నగరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. సరిహద్దుల్లో మరిన్ని బలగాలను మోహరించింది. ఈ నేపథ్యంలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లీయిన్ స్పందించారు. యూరప్ లో మళ్లీ యుద్ధాన్ని రాజేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

"రష్యా లక్ష్యం కేవలం డాన్ బాస్ ప్రాంతం కాదు, ఉక్రెయిన్ కూడా కాదు... రష్యా లక్ష్యం వేరే ఉంది. యూరప్ లోని సుస్థిరతను దెబ్బతీయడమే రష్యా అధినాయకత్వం ఆలోచన. అంతర్జాతీయ నియమావళిని, ఒప్పందాలను, చట్టాలను ఆసాంతం దెబ్బతీయడమే రష్యా లక్ష్యం" అని వివరించారు. అందుకే ఈ విషయంలో రష్యాను దోషిగా పేర్కొంటున్నామని తెలిపారు.

కీలక అంశాల్లో ఆంక్షల ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థలను వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తామని చెప్పారు. కీలకమైన సాంకేతికతలు పొందడంలోనూ, ఆర్థిక మార్కెట్లలోనూ రష్యాను నిరోధిస్తామని ఉర్సులా వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ఆర్థిక పునాదులను బలహీనపర్చడమొక్కటే మార్గమని అన్నారు. యూరోప్ వ్యాప్తంగా ఉన్న రష్యా ఆస్తుల స్తంభన, యూరప్ ఆర్థిక మార్కెట్లలో రష్యా బ్యాంకులకు అనుమతి నిరాకరణ వంటి చర్యలు తీసుకుంటామని వివరించారు.

తక్షణమే రష్యా బలగాలను వెనక్కి పిలిపించండి: పుతిన్ కు జర్మనీ రక్షణ మంత్రి స్పష్టీకరణ

గత కొన్నిరోజులుగా ఉక్రెయిన్ పై యుద్ధ సన్నాహాలు చేస్తున్న రష్యా ఇవాళ అన్నంత పనీ చేసింది. భారీ ఆయుధ సంపత్తి కలిగిన రష్యా... చిరుదేశం అనదగ్గ ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. దీనిపై జర్మనీ రక్షణ మంత్రి క్రిస్టీన్ లాంబ్రెచ్ట్ స్పందించారు. రష్యా గతంలో ఎన్నడూ ఎదుర్కోనంతటి స్థాయిలో కఠినమైన ఆంక్షలు చవిచూడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికైనా స్పందించి తమ బలగాలను వెనక్కి పిలిపించాలని విజ్ఞప్తి చేశారు. మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమని ప్రతిపాదించినా, రష్యా అందుకు నిరాకరించిందని లాంబ్రెచ్ట్ ఆరోపించారు. అయితే చర్చలకు ఇప్పటికీ సమయం మించిపోలేదని తెలిపారు.
Ursula von der Leyen
European Commission
Russia
Ukraine
War
Sanctions

More Telugu News