Ahmedabad: అహ్మ‌దాబాద్ పేలుళ్ల కేసు: ఏకంగా 38 మందికి మ‌ర‌ణ‌శిక్ష విధించిన కోర్టు

2008 Ahmedabad serial bomb blast case special court pronounces death sentence to 38 out of 49 convicts
  • 2008లో బాంబు పేలుళ్లు
  • మొత్తం 49 మంది దోషులుగా నిర్ధారణ 
  • 11 మంది దోషుల‌కు జీవిత ఖైదు
గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ లో 2008లో చోటు చేసుకున్న వ‌రుస బాంబు పేలుళ్ల కేసులో గుజ‌రాత్ ప్ర‌త్యేక కోర్టు దోషుల‌కు శిక్ష‌లు ఖ‌రారు చేసింది. మొత్తం 49 మందిని దోషులుగా ఖ‌రారు చేసిన కోర్టు వారిలో 38 మందికి మ‌ర‌ణ శిక్ష విధించింది. మిగ‌తా 11 మంది దోషుల‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2008, జులై 26న అహ్మదాబాద్‌లో వరుసగా 21 చోట్ల బాంబు పేలుళ్లు సంభవించ‌డంతో 56 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడ్డారు.

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన పోలీసు అధికారులు పేలుళ్ల‌కు ఇండియన్ ముజాహిదీన్ తో పాటు హర్ఖత్ ఉల్ జిహాదీ ఆల్ ఇస్లామీ ఉగ్ర‌వాద‌ సంస్థలే కారణమని తేల్చారు. నిందితుల‌ను అరెస్టు చేసి అహ్మదాబాద్‌లోని సబర్మతీ జైలులో ఉంచారు. గతంలో కొంద‌రు నిందితులు జైలులో సొరంగం తవ్వడం, పారిపోవడానికి ప్ర‌య‌త్నాలు చేయ‌డం క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే.

ఈ కేసు విచారణలో  కోర్టు మొత్తం 1,100 మందికి పైగా సాక్షులను కోర్టు విచారించింది. ఈ కేసులో ఇప్ప‌టికీ కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి అహ్మదాబాద్‌లో 20, సూరత్‌లో 15 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. వీటిపై కోర్టు విచారణ జరిపింది. మొద‌ట‌ మొత్తం 78 మందిని నిందితులుగా నిర్ధారించింది. అనంత‌రం వారిలో ఒకరు అప్రూవర్‌గా మారిపోవ‌డంతో నిందితుల సంఖ్య 77కు తగ్గింది.

ఈ 77 మందిలో 49 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. 2002 గోద్రాలో రైలు బోగీలకు నిప్పంటించిన ఘ‌ట‌న‌కు ప్ర‌తీకారంగా 2008లో ఉగ్ర‌వాదులు దాడులు చేశారు. కాగా, అహ్మ‌దాబాద్‌లో పేలుళ్లు జ‌ర‌గ‌డానికి ముందు రోజు కర్ణాటక రాజ‌ధాని బెంగళూరులోనూ వరుసగా ఎనిమిది బాంబు పేలుళ్లు జరిగాయి.
Ahmedabad
India
Gujarath

More Telugu News