Corona Virus: కరోనా వైరస్‌కు సంబంధించి మరో షాకింగ్ విషయం.. మృతదేహాల్లోనూ 41 రోజులపాటు సజీవంగానే వైరస్!

  • 41 రోజుల్లో 28 సార్లు మృతదేహానికి ఆర్టీపీసీఆర్ టెస్టు
  • అన్నిసార్లూ పాజిటివ్‌గానే నిర్ధారణ
  • పోస్టుమార్టం తర్వాత 35 గంటల వరకు వైరస్ వృద్ధి
  • మృతదేహం నుంచి వైరస్ సంక్రమణపై లేని స్పష్టత
Corona virus alive 41 days in human dead body

కరోనా మహమ్మారికి టక్కుటమార విద్యలు తెలుసని ఇప్పటికే నిరూపణ అయింది. ఎప్పటికప్పుడు కొత్త రూపంతో దాడిచేస్తూ ఉనికిని చాటుకుంటోంది. ఈ క్రమంలో ఈ మహమ్మారికి సంబంధించి మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. కరోనా కారణంగా మరణించిన వారి మృతదేహాల్లో ఇది దాదాపు 41 రోజులపాటు సజీవంగా ఉంటుందని ఇటలీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అయితే, ఇది మృతదేహం నుంచి కూడా ఇతరులకు సంక్రమిస్తుందా? లేదా? అన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు.  

ఉక్రెయిన్‌కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి సముద్రంలో మునిగి మరణించాడు. 16 గంటల తర్వాత అతడి మృతదేహాన్ని గుర్తించారు. నిబంధనల ప్రకారం అతడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అనంతరం మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. ఆ తర్వాత 41 రోజుల్లో 28 సార్లు ఆ మృతదేహానికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఆశ్చర్యకరంగా అన్నిసార్లూ అతడికి కరోనా పాజిటివ్‌గానే నిర్ధారణ కావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.

అయితే, మృతదేహాల నుంచి కరోనా వ్యాప్తికి సంబంధించి కానీ, మృతదేహంలో అది ఎన్ని రోజులు సజీవంగా ఉంటుందన్న విషయంలో కానీ స్పష్టత లేదని దానిపై పరిశోధనలు చేసిన డిఅనున్ జియో విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాత 35 గంటల వరకు మృతదేహంలో వైరస్ వృద్ది చెందినట్టు జర్మనీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, ఇందుకు సంబంధించిన వివరాలను ‘మెడిసిన్ కేస్’ పత్రిక ప్రచురించింది.

More Telugu News