Odisha: సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష!

  • ఒడిశాలోని కుటరా గ్రామస్థుల వినూత్న విధానం
  • మంచి సర్పంచ్ కోసం ఓ రైతు ఆలోచన
  • సర్పంచ్ అభ్యర్థులకు 7 ప్రశ్నలు
  • తొలి పావుగంటలో ప్రసంగం
  • ఆ తర్వాత పావుగంటలో రాత పరీక్ష
Odisha Villagers Make Sarpanch Candidates To Take Test

మామూలుగా సర్పంచ్ ను ఓట్లేసి ఎన్నుకుంటూ ఉంటాం. అభ్యర్థి గురించి తెలిసినా తెలియకపోయినా.. పార్టీని చూసి ఓటేస్తుంటాం. ఆ ఊర్లోనూ అంతే. కాకపోతే సర్పంచ్ అభ్యర్థికి రాతపరీక్ష, ప్రసంగ పరీక్ష పెట్టి అందులో ఉత్తమమైన వ్యక్తిని ఎంపిక చేస్తున్నారు. ఒడిశాలోని సందర్ గఢ్ జిల్లాలోని కుటరా గ్రామంలో జరిగిందీ ఆసక్తికర పరిణామం.

ఈ నెల 16 నుంచి ఒడిశాలో పంచాయతీ ఎన్నికలు మొదలు కానున్నాయి. ఐదు దశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో కుటరా గ్రామానికి 18న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్న వారికి గ్రామస్థులు రాతపరీక్ష పెడుతున్నారు. గత గురువారం వార్డు నంబర్ 8 నుంచి 8 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఆ ఫలితాలను గ్రామస్థుల ముందు ఉంచుతారు. ఆ ఫలితాల ఆధారంగా మంచి వ్యక్తికి జనాలు ఓటేసేలా చూస్తున్నారు.

డిగ్రీ డ్రాపౌట్ అయిన ప్రదీప్ లక్రా (38) అనే రైతు ఆలోచన ఇదంతా. పరీక్షకు వారం ముందే సర్పంచ్ అభ్యర్థులందరికీ సమాచారం ఇస్తామని ఆయన తెలిపారు. 9 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నా  8 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని, ఒకరి తర్వాత ఒకరికి ప్రాథమిక పాఠశాల ఆవరణలో పరీక్షను నిర్వహించామని చెప్పారు. మరో అభ్యర్థి పెళ్లి ఉందని చెప్పి రాలేకపోయారని తెలిపారు.

పరీక్షలో భాగంగా ఏడు ప్రశ్నలు ఇచ్చామని, అరగంటలో వాటన్నింటికీ జవాబులు రాసేలా టైం పెట్టామని ఆయన చెప్పారు. ఇచ్చిన ప్రశ్నలకు తొలి పావుగంటలో ప్రసంగం ద్వారా, ఆ తర్వాత పావుగంటలో లిఖితపూర్వకంగా సమాధానాలను చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షలో పాస్, ఫెయిల్ అన్నదేంలేదని, అభ్యర్థి ఎలాంటివాడు అని తెలుసుకొనేందుకే ఈ పరీక్షను పెడుతున్నామని గ్రామస్థులు చెప్పారు. తమ నేత ఎలాంటివాడో తెలుసుకునే హక్కు ఓటర్లకుంటుందని లలితా బరువా (42) అనే మహిళా అభ్యర్థి స్పష్టం చేశారు. కాగా, కుటరా గ్రామంలో 16 వార్డులకుగానూ 5,500 మంది ఓటర్లున్నారు.

అడిగిన ప్రశ్నలివే..

మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు?
గెలిస్తే రాబోయే ఐదేండ్ల పాటు మీ ప్రణాళిక ఏమిటి?
సమాజ సేవ కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారా?
ఇప్పటిదాకా మీరు చేసిన సామాజిక సేవకు సంబంధించి ఐదు ఉదంతాలను వివరించండి?
ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరిగినట్టే గెలిచాక ఇంటింటికీ సేవలందేలా చూస్తారా?
ఓ గ్రామ పంచాయతీ అంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? మీరెలా మార్చి చూపిస్తారు?
గత ఇద్దరు సర్పంచుల గురించి రెండు వాక్యాల్లో చెప్పండి?

More Telugu News