Pakistan: పుట్టే అమ్మాయిని అబ్బాయిగా మారుస్తానంటూ నిండు గర్భిణి తలలో మేకు దించిన నకిలీ బాబా!

Fake baba drills nail into pregnant lady head to give birth to a baby boy
  • పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘటన
  • వివాహితకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు
  • మళ్లీ అమ్మాయే పుడితే వదిలేస్తానని భర్త హెచ్చరిక
  • బాబాను ఆశ్రయించి ప్రాణం మీదకు తెచ్చుకున్న బాధితురాలు
  • ఆమె చెప్పింది విని హతాశులైన వైద్యులు
  • పరారీలో నకిలీ బాబా
రోజుకో సాంకేతికత పురుడు పోసుకుంటున్న ఈ టెక్నాలజీ యుగంలో మంత్రాలకు ఇంకా చింతకాయలు రాలుతున్నాయా? సృష్టిని సమూలంగా మార్చేసే శక్తి వారికి నిజంగా ఉందా? ఎంతమాత్రమూ లేదన్నది అందరికీ తెలిసిన సత్యం. కానీ, అమాయకులు ఇంకా వారి బారినపడి మోసపోతున్నారు. ఇందుకు ఏ దేశమూ మినహాయింపు కాదు. నకిలీ బాబాలను, మంత్రగాళ్లను నమ్మి మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతున్నా ఈ జాబితా మాత్రం తగ్గడం లేదు. తాజాగా, మన పొరుగుదేశం పాకిస్థాన్‌లో జరిగిన ఘటన తీవ్ర సంచలనమైంది.

‘మాయల ఫకీరు ’ మాటలు నమ్మిన ఓ గర్భిణి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అసలు విషయంలోకి వెళ్తే.. పెషావర్‌కు చెందిన వివాహితకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. తాజాగా, ఆమె మరోమారు గర్భం దాల్చింది. నెలలు నిండుతుండడంతో పుట్టబోయేది అమ్మాయేనన్న అనుమానం ఆమెలో మొలకెత్తింది. ఈసారి అబ్బాయి పుట్టకుంటే వదిలిపెట్టేస్తానన్న భర్త బెదిరింపులతో ఆమె తీవ్ర భయాందోళనలకు గురైంది. దీంతో ఈ గండం నుంచి బయటపడేందుకు పరిపరి విధాల ఆలోచించింది. ఈ క్రమంలో ఓ బాబా గురించి తెలుసుకుంది. చివరికి ఎలాగోలా ఆమెను కలసి తన సమస్య చెప్పుకుంది.

అంతా సావధానంగా విన్న ఆ ‘బాబా’ ఊహకు అందని సలహా ఇచ్చాడు. లోపల పెరుగుతున్నది ఎవరైనా సరే.. తలలో మేకు కొడితే కచ్చితంగా అబ్బాయే పుడతాడంటూ ఆమెను నమ్మించాడు. అతడి మాయ మాటలపై పూర్తిగా విశ్వాసముంచిన బాధితురాలు తలపై మేకు కొట్టించుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకు తలలోకి రెండు అంగుళాల మేర దిగగానే బాధతో విలవిల్లాడిపోయింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు మేకును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో వెంటనే పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడామెకు పరీక్షలు చేసిన వైద్యులు మేకు పుర్రెను చీల్చుకుని వెళ్లిందని చెప్పారు. అయితే, అది మెదడును తాకకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు తలలోకి మేకు ఎలా వెళ్లిందని వైద్యులు ఆరా తీయగా, వారు చెప్పింది విని షాక్‌తో బిగుసుకుపోయారు.

గర్భిణి తలలో మేకు ఉన్న ఎక్స్‌రే ఫొటోలు అక్కడి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనపై ఫిర్యాదు అందనప్పటికీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆసుపత్రికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. విషయం వెలుగులోకి రావడంతో నకిలీ బాబా పరారయ్యాడు. ఇప్పుడతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Pakistan
Peshawar
Woman
Preganant
Nail
Head

More Telugu News