Digital Rupee: డిజిటల్ రూపీతో కేంద్రానికి బోలెడు ఖర్చు ఆదా 

  • కరెన్సీ ముద్రణ, పంపిణీ, నిర్వహణకు భారీగా ఖర్చు
  • ప్రతీ రూ.100 నోటు తయారీకి రూ.17 వ్యయం
  • డిజిటల్ రూపీ వినియోగం పెరిగితే ఖర్చులు ఆదా
Digital Rupee to save costs of printing distributing and storing cash

వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే డిజిటల్ రూపీ దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఆర్బీఐ త్వరలోనే డిజిటల్ రూపీ (సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ/సీబీడీసీ) విడుదల చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెట్ సందర్భంగా ప్రకటించడం తెలిసిందే. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి చాలా ఖర్చు ఆదా కానుంది.

నిర్వహణ ఖర్చులు, ప్రింటింగ్, పంపిణీ, నిల్వ రూపంలో ఖర్చులు తగ్గనున్నాయి. వ్యవస్థలో చలామణిలో ఉన్న భౌతిక కరెన్సీలో కొంత భాగం మేర డిజిటల్ రూపీలోకి మారిపోనుంది. అంటే ఆ మేరకు భౌతిక కరెన్సీ తగ్గిపోనుంది. భౌతిక కరెన్సీ తగ్గిందంటే ఆ మేరకు ఆర్బీఐకి ఖర్చులు ఆదా అయినట్టే.

ప్రతి రూ.100 నోటు తయారీకి రూ.15-17 ఖర్చవుతోంది. దీని కాల వ్యవధి నాలుగేళ్లు. అంటే పాతబడిన నోట్లను బ్యాంకుల నుంచి వెనక్కి తీసుకుని వాటి స్థానంలో కొత్తగా ముద్రించిన నోట్లను ఆర్బీఐ విడుదల చేస్తుంటుంది. ఇది ఎప్పుడూ నడిచే ప్రక్రియ. కనుక ఈ విధానంలో కరెన్సీ నోట్ల ముద్రణకు ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది.

సీబీడీసీతో కరెన్సీ నిర్వహణ ఖర్చు తగ్గుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ మాజీ ఉద్యోగి రామ్ రస్తోగి తెలిపారు. డిజిటల్ రూపీని వ్యక్తులు తమ మధ్య లావాదేవీలకు ఫియట్ కరెన్సీగా వినియోగించుకోవచ్చు. 2021 మార్చి నాటికి వ్యవస్థలో రూ.28.32 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉంది. 2020-21లో కొత్తగా 4,19,000 బ్యాంకు నోట్లను ఆర్బీఐ ముద్రించింది.

More Telugu News