Paritala Sriram: నిరాహారదీక్ష చేపట్టిన పరిటాల శ్రీరామ్

  • ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
  • ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శ్రీరామ్ నిరాహారదీక్ష
  • వైసీపీ నేతలు గాడిదలు కాస్తున్నారా? అని మండిపాటు
Paritala Sriram hunger strike

అనంతపురం జిల్లాలో జిల్లాల విభజన అంశం సరికొత్త వివాదాలకు దారితీసింది. హిందూపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పటికే దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను రద్దు చేయడం వివాదాస్పదమయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఈరోజు నిరాహారదీక్షను చేపట్టారు. ధర్మవరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు ఆయన దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.  

ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను రద్దు చేస్తే వైసీపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గాడిదలు కాస్తున్నారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ డివిజన్ గా ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ధర్మవరానికి ఆ హోదాను తొలగించడం అన్యాయమని అన్నారు.

ధర్మవరం అభివృద్ధిని వెనక్కి నెట్టేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజలందరితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. పరిటాల శ్రీరామ్ నిరాహారదీక్ష నేపథ్యంలో ధర్మవరం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

More Telugu News