Leena Jelal: లాటరీలో రూ.44 కోట్లు గెలిచిన కేరళ యువతి

Kerala woman wins huge lottery in Abudabhi
  • తొమ్మిది మందితో కలిసి లాటరీ టికెట్ కొన్న యువతి
  • అబుదాబి వీక్లీ డ్రాలో బంపర్ ప్రైజ్
  • మాటలు రావడంలేదన్న యువతి
  • డబ్బును ఏంచేయాలో ఇంకా డిసైడ్ చేయలేదని వెల్లడి

అరబ్ దేశాల్లో నిర్వహించే లాటరీలను భారతీయులు గెలవడం కొత్తేమీకాదు. తాజాగా ఓ యువతి లాటరీలో విజేతగా నిలవడం విశేషం. ఆమె పేరు లీనా జలాల్. లీనా కేరళకు చెందిన యువతి. త్రిసూర్ జిల్లాలోని అంజన్ గడి ప్రాంతానికి చెందిన ఆమె, ఉద్యోగరీత్యా గత నాలుగేళ్లుగా అబుదాబిలో ఉంటోంది. అబుదాబిలో షోయిదార్ ప్రాజెక్ట్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎల్ఎల్ సీ అనే కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తోంది.

ఇటీవల ఆమె అబుదాబి వీక్లీ లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. ఈ నెల 3వ తేదీన డ్రా తీయగా, లీనా జలాల్ కొనుగోలు చేసిన టికెట్ కు రూ.44 కోట్ల భారీ ప్రైజ్ మనీ దక్కింది. అయితే, ఆ టికెట్ ను ఆమె తనతో పాటు ఆఫీసులో పనిచేసే మరో తొమ్మిది మందితో కలిసి కొనుగోలు చేసింది. దాంతో, ఆ ప్రైజ్ మనీని ఇప్పుడు వారందరూ పంచుకోనున్నారు. అయినప్పటికీ, ఒక్కొక్కరికి రూ.4 కోట్లు దాకా వస్తుంది.

దీనిపై లీనా జలాల్ మాట్లాడుతూ, తన మిత్రులతో కలిసి గత ఏడాది కాలంగా లాటరీ టికెట్లు కొంటున్నానని, తొలిసారిగా ఓ టికెట్ కు లాటరీ వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తోంది. తాము కొనుగోలు చేసిన టికెట్ కు లాటరీ తగిలిందని చెప్పగానే, తొలుత నమ్మలేకపోయానని వెల్లడించింది. తనకు మాటలు రావడంలేదని, దేవుడికి రుణపడి ఉంటానని తెలిపింది. అయితే, ఈ డబ్బును ఏంచేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని లీనా పేర్కొంది. కుటుంబ సభ్యులను అడిగిన తర్వాత నిర్ణయించుకుంటానని వివరించింది.

  • Loading...

More Telugu News