India: భారత బడ్జెట్ పై ఐఎంఎఫ్ ప్రశంసలు.. ఆలోచనాత్మక భవిష్యత్ బడ్జెట్ అన్న ఎండీ క్రిస్టలీనా

  • ఈ ఏడాది భారత్ వృద్ధి అంచనా 9 శాతం
  • వచ్చే ఏడాది పుంజుకునే అవకాశం
  • క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు మున్ముందు ఉండకపోవచ్చు
IMF MD Christalina Georgeiva Comments On India Budget

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే.. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మాత్రం ప్రశంసలు కురిపించింది. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఆలోచనాత్మకంగా రూపొందించిన బడ్జెట్ ఇదని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జివా అన్నారు. మానవ వనరులు, డిజిటలైజేషన్ పరిశోధన, అభివృద్ధిలో ఆవిష్కరణలను ప్రోత్సహించేలా బడ్జెట్ ఉందని ప్రశంసించారు.

ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా మౌలికవసతుల కల్పన, ఉద్యోగాల సృష్టికే ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం రూ.39.45 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మొత్తం డిజిటల్ భారత్ అనే థీమ్ తో ఈ సారి బడ్జెట్ ను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే భారత్ వృద్ధి గతంతో అంచనా వేసిన దానికన్న 0.5 శాతం తక్కువగా నమోదవుతుందని క్రిస్టలీనా జార్జివా చెప్పారు. 2022కు సంబంధించి భారత వృద్ధి రేటు 9 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2023లో కొంచెం పుంజుకుంటుందని వివరించారు.

భారత్ లాంటి ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలకు ప్రస్తుతం ఉన్న క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు మున్ముందు పెద్ద సమస్యగా ఉండకపోవచ్చని అన్నారు. ధరల పెరుగుదల కూడా ఎక్కువగా ప్రభావం చూపకపోవచ్చన్నారు. స్వల్పకాలిక సమస్యలపై దృష్టి పెడుతూనే దీర్ఘకాలిక నిర్మాణాత్మక మార్పులపైనా ఫోకస్ పెడుతూ బడ్జెట్ ను తయారు చేశారని కొనియాడారు.

More Telugu News