AAP: పార్టీ మారబోమంటూ అభ్యర్థుల నుంచి హామీ పత్రాలు తీసుకుంటున్న 'ఆప్'!

AAP makes candidates sign loyalty affidavit
  • గోవా ఎన్నికల్లో ఆప్ కొత్త పధ్ధతి 
  • పార్టీ మారమనీ, అవినీతికి పాల్పడబోమని అఫిడవిట్లు 
  • ఓటర్లకు వీటి కాపీల పంపకం
  • మాట తప్పితే కోర్టు కేసులు తప్పవన్న కేజ్రీవాల్ 

ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాల్లో కొత్త సంప్రదాయాలను అనుసరిస్తోంది. గోవాలో పార్టీ అభ్యర్థుల నుంచి ప్రమాణ పత్రాలను తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 39 మంది అభ్యర్థులు.. తాము గెలిచిన తర్వాత పార్టీని వీడబోమని, అలాగే, అవినీతికి పాల్పడబోమని అఫిడవిట్లలో పేర్కొన్నారు.  

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘గోవా రాజకీయాల్లో రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి. భారీ అవినీతి. పార్టీలు ఫిరాయించడం. అవినీతి కారణంగా ప్రజలు కనీస సౌకర్యాలు పొందలేకపోతున్నారు. నేతలు ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ తరఫున గెలవడం, ఆ తర్వాత మరో పార్టీకి మారిపోవడం నడుస్తోంది. గడిచిన రెండు ఎన్నికల్లోనూ గోవాలో ఇదే కనిపించింది.

అఫిడవిట్లు సమర్పించిన మా పార్టీ అభ్యర్థులు గెలిచిన తర్వాత.. నిజాయతీగా పని చేయాలి. లంచాలు తీసుకోకూడదు. అవినీతికి పాల్పడకూడదు. ఆప్ ను వీడకూడదు’’ అని కేజ్రీవాల్ చెప్పారు. ఈ అఫిడవిట్ పత్రాల కాపీలను ఓటర్లకు పంచుతామన్నారు.

గెలిచిన తర్వాత పార్టీ అభ్యర్థులు అవినీతికి పాల్పడినా, పార్టీ వీడినా ప్రజలే వారిపై చర్యలు తీసుకునేలా ప్రోత్సహిస్తామన్నారు. అభ్యర్థులు న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. గోవాలో స్వచ్ఛమైన పాలనను అందిస్తామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News